దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను పర్యవేక్షించాలి

Feb 24,2024 21:34

ప్రజాశక్తి – గరుగుబిల్లి : దీర్ఘకాలికమైన వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు సూచించారు. సన్యాసిరాజుపేట (ఎస్‌ఆర్‌పేట) లో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్య తనిఖీలు, నిర్ధారణ పరీక్షలు, చికిత్సా వివరాలు రికార్డులను పరిశీలించారు. అక్కడ రోగులు, గర్భిణీలతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలున్న వారి ఆరోగ్యం ఏ మేరకు మెరుగుపడుతున్నదీ పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం సిబ్బందితో కలిసి నాడీ వ్యవస్థకు సంబంధించిన దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తుని గృహ సందర్శన చేసి ఆరోగ్య పరిశీలన చేశారు. వారికి అందజేసిన మందులను పరిశీలించారు. అనంతరం ఆయన వీధుల్లో ఉన్న కిరాణా షాపుల వద్దకు వెళ్లి చెత్త తొట్టెలను ఉంచాలని, ప్లాస్టిక్‌ తదితర వ్యర్థ పదార్థాలను కాల్వల్లో పడవేయరాదని స్పష్టం చేశారు. గ్రామంలో జ్వరాలు గుర్తిస్తే వెంటనే తెలిజేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిశీలన చేసి ఆరోగ్య సూత్రాలు వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ సంతోష్‌కుమార్‌, సిబ్బంది రవణమ్మ, ఇంద్రాణి, రమేష్‌, 104 సిబ్బంది దుర్గాప్రసాద్‌, జగదీష్‌, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

➡️