ధాన్యం డబ్బులు జమచేయకపోతే ఉద్యమం

Mar 21,2024 20:43

ప్రజాశక్తి – కొమరాడ : ఈ నెల 26వ తేదీ లోపు రైతులు ఖాతాలో ధాన్యం డబ్బులు జమ చేయకపోతే కలెక్టర్‌ కార్యాలయం వద్ద రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన, ఉద్యమం చేస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి అన్నారు. ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమచేయాలని కోరుతూ మండల కేంద్రంలోని జూనియర్‌ కాలేజ్‌ సెంటర్‌ వద్ద గురువారం రైతులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎంతో శ్రమించి కష్టపడి అప్పులు చేసి ధాన్యాన్ని పండించి ప్రభుత్వానికి అమ్మితే ఇప్పటికి 56 రోజులు కావస్తున్నా ఇంత వరకూ రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వేయలేదన్నారు. దీంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహించారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు వారాల్లోనే డబ్బులు వేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వేయకపోతే కలెక్టర్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.ధాన్యం డబ్బులు చెల్లించకుంటే నిరసనజియ్యమ్మవలస: రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం 21 రోజుల్లో రైతు ఖాతాలకు డబ్బులు వేస్తామని హామీ ఇచ్చి నేటికి రెండు నెలలు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన్యం జిల్లాలో 4వేల మంది రైతులకు చెందిన రూ.48.25 కోట్లు ధాన్యం బకాయిలు ఉన్నాయని వీటిని సోమవారంలోగా చెల్లించకుంటే రైతులతో కలిసి ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల సహకారం తీసుకుని నిరవదిక నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు బడే స్వామి నాయుడు, లచ్చిరెడ్డి సత్యనారాయణ, దత్తి చంద్రమౌళి, పల్ల వెంకట నాయుడు, రంభ కృష్ణమూర్తి నాయుడు, గుణుపూరు వెంకట నాయుడు తదితరు రైతులు పాల్గొన్నారు.

➡️