నాటుబళ్లతో ఇసుక డంప్‌

Dec 25,2023 21:19

ప్రజాశక్తి – మక్కువ : ఇసుక అక్రమ రవాణాదారులకు అడ్డాగా సువర్ణముఖీ నది తీరాలు మారాయి. వీరి అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేదు. చేతిలో ఏ విధమైన టోకెన్‌ లేకపోయినా ఆదివారాలు సెలవైనా వీరి రవాణాకు మాత్రం అడ్డులేదు. రైతులు నాటుబళ్లతో రహదారి వరకు ఇసుకను డంప్‌ చేయించి, అక్కడ నుంచి ట్రాక్టర్లు నింపుకొని జంప్‌ అవ్వడం వీరికి పరిపాటిగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయా శాఖల అధికారులకు తెలిసినా అక్రమ ఇసుక దందాను చూసీ చూడనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు దారితీస్తుంది. మండలంలోని వెంకట బైరీపురం పంచాయతీని ఆనుకొని ఉన్న సువర్ణముఖి మడతోటరేవు ఇసుక మాఫియాకు అనువుగా మారింది. మండలంలోని డి-శిర్లాం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇసుక రీచ్‌ ఉంది. ఇక్కడ నుంచి మక్కువ, పార్వతీపురం తదితరు మండలాలకు ఇసుక రవాణా జరుగుతుంది. చాలావరకు జగనన్న ఇళ్ల పేర్లతో ఒకటి రెండు టోకెన్లు చూపించి ఇసుక మాఫియా అక్రమంగా ఇక్కడి నుంచి ఇసుక తరలించుకుపోతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఇసుక రీచ్‌ దిగువ భాగంలో పంపు హౌస్‌కు ఎదురుగా ఉన్న పోలమ్మ రేవు నుండి మడతోట రేవు వరకు సువర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుక తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఆదివారం కూడా ఏ విధమైన అనుమతుల్లేకుండా తెల్లవారు నుండి ఇసుకను ట్రాక్టర్లతో తరలించకపోతున్నా అడ్డుకొనే వారే లేరని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాటుబళ్లతో ఇసుక డంపు… మడతోటరేవులోని ఇసుకను నాటుబళ్లతో రహ దారి ప్రాంతానికి డంపు చేస్తూ అక్కడ నుండి ట్రాక్టర్లతో నింపు కొని తరలించుకుపోతున్నారు. నాటుబళ్లయితే ఎవరికీ అను మానం రాదని తెలిసి ఈ విధమైన ఎత్తులు ఇసుక మాఫియా వేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో నాటు బండికి రూ.200 డంప్‌ చేయడానికి ట్రాక్టర్ల యజమానులు చెల్లిస్తు న్నారు. మండలంలోని ఓ వ్యక్తి పలు శాఖల అధికారులతో సమన్వయ చేస్తూ మక్కవ, పార్వతీపురం మండలాల్లో ఇసుక అక్రమ దందాలో ప్రముఖ భూమిక పోషిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే ఆయన చెప్పే ట్రాక్టర్లకే అధిక అనుమతులు ఇస్తూ ఉండడంతో కొంతమంది ట్రాక్టర్‌ యజమానులు కూడా ఇబ్బందులకు గురవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా భూగర్భ గనుల శాఖ అధికారులు కూడా కనీసం పట్టించుకోవడం లేదని, ఇతర శాఖల మాదిరిగానే వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి అక్రమ ఇసుక దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

➡️