నాలుగో విడత ‘చేయూత’ నిధులు జమ

Mar 7,2024 21:10

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : వైఎస్సార్‌ చేయూత పథకం నాలుగో విడత నిధులు విడుదల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో లబ్దిదారులకు రూ.136.60 కోట్లు నమూనా చెక్కును ఇన్‌ఛార్జి జాయింటు కలెక్టరు సి. విష్ణుచరణ్‌ లబ్దిదారులకు గురువారం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గురువారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేయూత నిధులను మీటనొక్కి నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. జాయింటు కలెక్టరు సి.విష్ణుచరణ్‌, లబ్దిదారులు కలెక్టరు కార్యాలయ సమావేశమందిరం నుండి వర్చువల్‌ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో 72,854 మంది లబ్దిపొందిన మహిళలకు ఒక్కొక్కరి ఖాతాలో రూ.18,750 చొప్పున రూ.136,60,12,500 నిధులు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. అనంతరం ఇన్‌ఛార్జి జెసి మాట్లాడుతూ మహిళా లబ్దిదారులకు కుటుంబ స్థాయిలో మెరుగైన జీవనోపాధులను అంది పుచ్చుకునేలా అవకాశాలను కల్పించడం, సంపద సృష్టి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం అందించిన ఈ సాయంతో మహిళలు పశువుల పెంపకం, పాల సేకరణ, ఆరోగ్య సేవలు, కిరాణా షాపులు, బట్టల షాపులు, పండ్లు, కూరగాయలు, చిన్న జీవాలు కొనుగోలు, చిన్న మధ్య తరహా వ్యాపారాలు నడుపుకోవడానికి లేదా జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకోని ఉపాధి పొందినట్లు కార్యక్రమానికి హాజరైన మహిళలు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టు అధికారి వై. సత్యంనాయుడు, లబ్దిదారులు పాల్గొన్నారు.

➡️