నిధులు వృథా చేస్తారా?

Feb 29,2024 21:40

ప్రజాశక్తి – సాలూరు: మున్సిపాలిటీలో అత్యవసరం కాని పనులకు సాధారణ నిధులు ఎలా ఖర్చు చేస్తారని పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో అధికారపార్టీ సభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మురికివాడల్లో కనీస అవసరాలు తీర్చడానికి నిధుల్లేవని చెపుతున్న అధికారులు పనికిమాలిన పనుల కోసం లక్షలు ఎలా ఖర్చు చేస్తారని వైసిపి కౌన్సిలర్లు నిలదీశారు. తన వార్డు బంగారమ్మపేటలో వీధి దీపాలు వెలగడం లేదని, తాగునీటి సరఫరా జరగడంలేదని కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నా పట్టించుకోని అధికారులు రూ.11.5లక్షలతో పారిశుధ్య నిర్వహణ వాహనాలకు నీడ్‌ కోసం షెడ్‌ ఎలా నిర్మిస్తారని కౌన్సిలర్‌ సింగారపు ఈశ్వరరావు ప్రశ్నించారు. 11వ వార్డు చినహరిజనపేటలో రూ.50వేలు ఖర్చు చేస్తే చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయని, వాటికి నిధుల్లేవని చెపుతున్న అధికారులు ఇప్పుడెలా లక్షలు ఖర్చు చేస్తున్నారని కౌన్సిలర్‌ లింగాల దుర్గా ప్రశ్నించారు. కౌన్సిలర్లు గిరిరఘు, గొర్లి వెంకటరమణ, రాపాక మాధవరావు, బి.శ్రీనివాసరావు, పప్పల లక్ష్మణరావు మాట్లాడుతూ రేకుల షెడ్‌ కోసం రూ.11.5లక్షలు సాధారణ నిధులు ఎలా ఖర్చు చేస్తారని నిలదీశారు. వీరి వాదనకు వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, జర్జాపు దీప్తి మద్దతు పలికారు. పారిశుధ్య విభాగంలో ఆరుగురు డ్రైవర్లు ఉండగా మళ్లీ డ్రైవర్‌ అవసరం ఎందుకు వచ్చిందని కౌన్సిలర్లు గిరిరఘు, గొర్లి వెంకటరమణ, రాపాక మాధవరావు ప్రశ్నించారు. అసలే నిధుల కొరతతో సతమతమవుతున్న మున్సిపాలిటీపై ఆర్థిక భారంపడేలా అధికారుల చర్యలు వున్నాయని చెప్పారు. జెసిబిని నడపడానికి అనుభవం వున్న డ్రైవర్‌ అవసరమని శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫకీర్‌ రాజు చెప్పారు. తనను శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ తప్పుతోవ పట్టించారని చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ అన్నారు. జెసిబి నడిపేందుకు నైపుణ్యం ఉన్న డ్రైవర్‌ కావాలని చెప్పారని తెలిపారు. మున్సిపాలిటీలో పన్నుల వసూలుకు కొంతమంది కౌన్సిలర్లు అడ్డు పడుతున్నారని ఆమె అన్నారు. వాహనాలు నిలుపుదల కోసం రేకులు షెడ్‌, జెసిబి నడపడానికి డ్రైవర్‌ నియామకం అంశాలను సభ్యులు ఆమోదించలేదు. దీంతో వైసిపి కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సమావేశంలో కమిషనర్‌ ప్రసన్నవాణి, ఎఇ సూరినాయుడు పాల్గొన్నారు.

➡️