నిధుల విడుదలపై గరం..గరం

పరస్పరం విమర్శించుకుంటున్న కౌన్సిలర్లు.. వారిస్తున్న మేయర్‌ మనోహర్‌నాయుడు (ఇన్‌సెట్‌)
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం సోమవారం వాడీవేడిగా జరిగింది. సమావేశానికి మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు అధ్యక్షత వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలవరకు సమావేశం కొనసాగింది. తొలుత సమావేశం ప్రారంభం కాగానే గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఎటిఆర్‌ ఇవ్వలేదని కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, రోషన్‌ ధ్వజమెత్తారు. రెండు వారాల్లో ఎటిఆర్‌ నివేదిక ఇవ్వాలని మేయర్‌ అధికారులను ఆదేశించారు. తన వార్డుకు తాగునీటి సమస్య పరిష్కరించనందుకు నిరసనగా టిడిపి కార్పొరేటరు నూకవరపు బాలాజీ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. నగరంలో పలు సమస్యలపై టిడిపి, వైసిపి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. గోరంట్ల మంచినీటి పథకాన్ని మేయర్‌, కమిషనర్‌ ఇంత వరకు పరిశీలన చేయలేదన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నాపట్టించుకోవడం లేదని పలువురు టిడిపి కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. ప్రధానంగా అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో జరుగుతున్న జాప్యంపై కమిషనర్‌కు, మేయర్‌కు మధ్య ఉన్న అంతరాలు ఈ సమావేశంలో బయటపడ్డాయి. నిధులు ఎలా విడుదల చేయాలనే అంశంపై మేయర్‌, ఇతర ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటే తాను ఈ నిర్ణయం అమలు చేస్తానని కమిషనర్‌ చేకూరి కీర్తి చెప్పారు. నిధుల విడుదలలో నెలకొన్న లోపాల వల్ల నగరంలోని అన్ని వార్డుల్లో రూ.100 కోట్ల మేరకు పనులు నిలిచిపోయాయని మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.50 దాటితే సిఎఫ్‌ఎంస్‌ ద్వారా ప్రభుత్వానికి పంపాలని, రూ.50 లక్షల లోపుఅయితే నేరుగా చెక్కులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటే అలాగే చేద్దామని కమిషనర్‌ బదులిచ్చారు. రూ.50 లక్షలకుపైబడిన కాంట్రాక్టు పనులు ఆగిపోతే తనను ప్రశ్నించవద్దన్నారు. ఇప్పటి వరకు సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా కూడా బిల్లులు క్లియర్‌ అవుతున్నాయని తెలిపారు. సీరియల్‌ నెంబరులో ఫస్టు కం ఫస్టు అవుట్‌ గా బిల్లులు చెల్లిస్తే బాగుంటుందని మేయర్‌ అభిప్రాయపడ్డారు. బిల్లులు రాకపోవడం వల్లతమ వార్డుల్లో పనులు జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు చెప్పారు. రూ.50 లక్షలు దాటిన బిల్లులు సిఎఫ్‌ఎంఎస్‌కు పంపిస్తామంటే పెద్ద పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రారని కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి,రోషన్‌, ఈచంపాటి ఆచారి అన్నారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల నగరంలోపనులన్నీ నిలిచిపోయాయని ఎమ్మెల్యే మద్దాలి గిరి అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని పలువురు కార్పొరేటర్లు కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికులసంఖ్యను పెంచడంలేదన్నారు. ఫాగింగ్‌ నిర్వహణ సరిగాలేదని కార్పొరేటర్లు మండిపడ్డారు. కార్పొరేటర్లు షేక్‌ ఖాజా మొహిద్దీన్‌, పోలవరపు జ్యోతి, వెంకటరెడ్డి,రంగారెడ్డి తదితరులు ప్రశ్నించారు. ఈ ఆటోలు రావడంలేదని, ఫుష్‌కాట్‌ల ద్వారా చెత్త తరలింపునకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రోబోలు ఉన్నా తమ వార్డుకు పంపడంలేదని కార్పొరేషన్‌ చిష్టి ఆరోపించారు. అలాగే నగరంలో హోర్డింగ్‌లపై సమావేశంలో తీవ్ర గరదరగోళం చెలరేగింది. హోర్డింగ్‌ల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని కార్పొరేటర్లు ఆరోపించారు. అనధికారిక హోర్డింగ్‌లు తొలగిస్తున్నా మళ్లీ వెంటనే వెలుస్తున్నాయని కార్పొరేటర్‌ రోషన్‌, వెంకటరెడ్డి, ఈచంపాటి ఆచారి ధ్యజమెత్తారు. ప్రజలపై పడి ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. హోర్డింగ్‌ల నుంచి రావాల్సిన ఫీజులను సక్రమంగా వసూలు చేయకుండా వారు కోర్టులకు వెళ్తున్నా టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు పట్టించుకోకుండా వారితో కుమ్మక్కు అవుతున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. భారీ హోర్డింగ్‌లకు ఆర్ట్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ వారు రూ.1.20 లక్షలు వసూలు చేస్తున్నారని కానీ కార్పొరేషన్‌కు మాత్రం ఫీజు కట్టడం లేదన్నారు. ఒకరి పేరున టెండరు పొంది మరొకరు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు కమిషనర్‌ చేకూరి కీర్తిమాట్లాడుతూ అనధికారిక హోర్డింగ్‌లను తొలగిస్తామని తెలిపారు. వీటి నిర్వాహకులపై చర్యలు ఉంటాయన్నారు. బస్‌బేలకు అనుమతి ఇవ్వడంపై టిడిపి, వైసిపి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేసినా వాటిని ఆమోదించారు. బస్‌బేల వల్ల విలువైన కార్పొరేషన్‌ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని అన్నారు. కార్పొరేటర్లంటే గౌరవం లేదని మల్లవరపు రమ్య విమర్శించారు. రెడ్దిపాలెం వద్ద ఆధిత్యనగర్‌లో డ్రెయిన్ల నిర్మాణం జాప్యం పై ఆమె ధ్వజమెత్తారు. గుంటూరులో టెండర్లు పొందిన కార్పొరేటర్లు పనులు ఎందుకు చేయడంలేదని ప్రతిపక్ష నాయకుడు కోవెలమూడి రవీంద్ర ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లయినా టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడిగారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ-ఆటోలు లేవని, చెత్త తొలగింపులో ఎన్నో లోపాలు ఏర్పడుతున్నాయని ధ్యజమెత్తారు. డొంకరోడ్డు నుంచి శారదాకాలనీకి కిలో మీటరు రోడ్డుకు రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని కార్పొరేటర్లు అంబేద్కర్‌ విమర్శించారు. ఇంకా పలు వార్డుల్లో పనులు జరగడంలేదని, చేపట్టిన పనులు పూర్తిచేయడంలో జాప్యం జరుగుతుందని కార్పొరేటర్లు విమర్శించారు. సంకురుశ్రీనివాసరావు, తేలుకుట్ల హనుమాయమ్మ, యట్ల రవికుమార్‌ మాట్లాడారు. డిప్యూటీమేయర్‌ డైమండ్‌బాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించండి : కెఎస్‌
నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్సీ కె.ఎస్‌ లక్ష్మణరా వు కోరారు. నగరంలో ఐదు రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్‌యూబి, ఆర్వోబిల నిర్మాణం కోసం చర్యలు తీసుకో వాలన్నారు. వీటిపై సర్వే జరుగుతోందని ఈనెల 5వ తేదీన రైల్వే అధికారులతో మాట్లాడనని తెలిపారు. శంకర్‌విలాస్‌ బ్రిడ్జి విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌యుబిలకు అవకాశం లేదని రైల్వే వారు చెప్పారని కమిషనర్‌ చేకూర్తి కీర్తి చెప్పగా ఆర్‌వోబిలు నిర్మిస్తే శ్యామలానగర్‌ దాదాపు 500 ఇళ్లు తొలగించాల్సి వస్తుందని ఆర్‌యుబి అయితే ఐదారు వరకు ఉంటాయని అన్నారు. గోరంట్ల నీటి పథకం ప్రారంభించడానికి ఉన్న అడ్డుం కులు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఫిల్టరే షన్‌ ప్లాంట్‌ నిర్మాణం జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు. త్వరగా ఈ పనులు పూర్తిచేయాలని లక్ష్మణరావు కోరారు. తాగునీటి సరఫరాలో తరచూ అంతరా యాలు ఏర్పడుతున్నాయని ప్రజల అవస రం మేరకు ఎందుకు సరఫరా చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. నీటి సరఫరా మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని, సూపర్‌వైజరీ కంట్రోలు, డేటా అక్విజేషన్‌ (స్కాడా) ఏర్పాటుతో లోపాలు సరిచేస్తామని అధికారులు తెలిపారు.

➡️