నిరసన తెలిపిన అంగన్‌వాడీలు

Jan 11,2024 21:26

ప్రజాశక్తి – సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమ్మె 31వ రోజుకు చేరుకున్నది. గురువారం అంగన్వాడీ కార్యకర్తలంతా జగన్మోహన్‌రెడ్డికి ఓట్లు వేసి తప్పు చేశామని తమ చెంపలు కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సునీత, ఆర్‌.లక్ష్మి, ఎస్‌.అరుణ, పి.పద్మ, సిఐయుటి నాయకులు జి.వెంకటరమణ, వై.రామారావు పాల్గొన్నారు. సాలూరు :అంగన్వాడీల సమ్మె గురువారం 31రోజుకు చేరింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కార్యకర్తలు, హెల్పర్లు చేపట్టిన సమ్మెలో భాగంగా 31 సంఖ్య రూపంలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎ.నారాయణమ్మ, శశికళ మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. గతంలో సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తిరుపతమ్మ, సుభద్ర అరుణ కుమారి పాల్గొన్నారు. సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట అంగన్‌వాడీల నిరవధిక సమ్మె కొనసాగింది. సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చులకనగా చూడటమే కాకుండా ఎస్మాను ఉపయోగించి, అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయించి, భయానక వాతావరణం కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం దిగి వస్తే గౌరవం ఉంటుందని, లేకుంటే అథఃపాతాళానికి పోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. గరుగుబిల్లి : మండల కేంద్రంలో సమ్మె శిబిరం వద్ద అంగన్‌వాడీలు ఒంటి కాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్బంధాన్ని ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని విమ ర్శించారు. ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ మండల నాయకులు మర్రాపు సావిత్రి, పద్మ, అచ్చియ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : అంగన్వాడీలు సిఎం జగన్‌ చిత్రపటం వద్ద మోకారిల్లి రోదనలు వినిపించారు. 31వ రోజు ఆకారంలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు సత్యవతి, కస్తూరి మాట్లాడుతూ సమ్మె తలపెట్టిన నెలరోజులు దాటినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తమ సమస్యలపై స్పందించి పరిష్కార మార్గం చూపకపోవడం దారుణమన్నారు. మండలంలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో నోటీసులు అంటించిన ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. బెదిరింపులకు లొంగకుండా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని అంగన్‌వాడీలు కరాకండీగా తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కోలక అవినాష్‌, మండంగి రమణ పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ : అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా స్థానిక కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరాహారదీక్ష 31వ రోజు కొనసాగింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, కోశాదికారి గొర్లి వెంకటరమణ, ఉపాధ్యక్షులు వి.ఇందిర, పట్టణ నాయకులు బొత్స లక్ష్శి, సమ్మె శిబిరం దగ్గర యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంటా జ్యోతి, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు మద్దతుగా ప్రసంగించారు. శిబిరంలో వివిధ మండలాల నుంచి వచ్చిన యూనియన్‌ నాయకులు పాటలు పాడుతు ఉత్సాహంగా సమ్మె కొనసాగించారు.అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.అంగన్వాడీ కేంద్రాలకు షోకాజ్‌ నోటీసులుప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌పది రోజుల్లోగా విధుల్లోకి చేరాలని అంగన్వాడీ కేంద్రాల బాధ్యులకు నోటీసులు పంపిస్తున్నట్లు స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ఎమ్మార్‌ నగరం అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని 120 కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు పది రోజుల్లో విధుల్లోకి చేరాలని వ్యక్తిగతంగానూ, కేంద్రాలకు నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్న వాలంటీర్లతో కలిసి నోటీసులు అంటించారు.

➡️