నిరుపయోగంగా తహశీల్దార్‌ భవనం

Jan 16,2024 22:58
లక్షలాది రూపాయలు

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌

లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం రెవెన్యూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్యాలయం శిధిలావస్థకు చేరింది. దీంతో ఎప్పుడు ఏ సమయంలో ఏ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సివస్తుందో అని అధికా రులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తించాల్సిన దుస్తితిలో ఉన్నారు. సామర్లకోట పట్టణ, మండల పరిధి లోని 18 గ్రామాల ప్రజలకు రెవెన్యూ సేవలం దించాల్సిన ప్రాధాన్యత గల తహశీల్దార్‌ కార్యాల యం ప్రస్తుతం శిధిలావస్థకి చేరుకుంది. 1996లో పిఠాపురం రోడ్డులో 1996లో తహశీల్దార్‌ కార్యాలయాన్ని లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించింది ప్రభుత్వం. అయితే కొన్ని సంవత్సరాలపాటు ఆ కార్యాలయంలోనే రెవెన్యూ కార్యకలాపాలు కొనసాగాయి. అయితే ఆ భవనం రెవెన్యూ కార్యకలాపాల నిర్వాహణకు సరిపోకపోవడంతో తహశీల్దార్‌ కార్యాలయాన్ని ఖాలీగా ఉంటున్న పూర్వ ఎంపిడిఒ కార్యాలయంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి 2016లో మార్పు చేశారు. రెవెన్యూ కార్య కలాపాల కోసం సరిపడక ఖాలీ చేసిన భవనంలో మనుగుల ద్బ్బి వార్డు సచివాలయంను ఏర్పాటు చేశారు. అయితే సచివాలయంగా మార్పు చేయడం వివాదస్పదం కావడం, హైకోర్టు ఆదేశాలతో ఆ భవనంలో ఉన్న సచివాలయంను వేరే అద్దె భవనంలోకి మార్పు చేశారు. దీంతో ఆ కార్యాలయ భవనం పూర్తిగా మూతపడింది. నేడు ఆ భవనం బూజులు బట్టి అసాంఘిక కార్యాకలాపాలకు నిలయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఇదే భవనం ఆవరణలో ఉన్న జన రటర్‌కు ఎటువంటి రక్షణ లేకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంది. ప్రస్తుతం రెవెన్యూ కార్యక లాపాలు నిర్వహిస్తున్న తహశీల్దార్‌ కార్యాలయం పూర్వం ఎంపిడిఒ కార్యాలయంగా ఉండేది. అది శిధిలా వస్థకు చేరుకోవడంతో ఎంపిడిఒ కార్యాలయంను ఆ భవనంలోకి మార్పు చేశారు. శిధిలావస్థలో ఉన్న భవనంలోకే తహశీల్దార్‌ కార్యాలయాన్ని మార్పు చేస్తూ తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. 2016 నుంచి ఇదే భవనంలో రెవెన్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ భవనం శిధిలావస్థకు చేరింది. భవనం గోడలు బీటలు వారాయి. పై కప్పు పెచ్చులుగా ఊడి పడు తున్నాయి. బీటలు వారిన ప్రాంతం నుంచి రావి, ఇతర మొక్కలు మొలు స్తున్నాయి. కార్యాలయం భవనం బీటలు వారి, స్లాబ్‌ నుంచి పెచ్చులు పడుతున్నాయి. దీంతో భయంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిపాదనలు బుట్టదాఖలు పిఠాపురం రోడ్డులో మూతపడి ఉన్న భవనంపై అదనపు గదులు నిర్మించడంతోపాటు, ఇతర మరమ్మతులు చేపట్టాలని సంబంధిత శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు రూ.39 లక్షల అంచనా లతో ప్రతిపాదనలను రూపొందించి జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. అయితే ఆ ప్రతిపాదనలు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ భవనం నిరూపయోగంగా ఉండటం, మరోవైపు రెవెన్యూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్యా లయం శిధిలావస్థకు చేరుకున్నట్లు ప్రభుత్వానికి నివేదించినా ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి స్పందన కన్పించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరూపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనంలో మరమ్మతులు చేపట్టి వినియోగం లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇదే అంశంపై డిప్యూటీ తహశీల్దార్‌ ఆర్‌శ్రీనివాస రావును ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా పిఠాపురం రోడ్‌లోని తహశీల్దార్‌ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టాలని రూ.13 లక్షలతో కొత్తగా ప్రతిపాదనలు పంపామని తెలిపారు.

➡️