నిర్లక్ష్య ఫలితాన్ని ప్రభుత్వం చవిచూడక తప్పదు

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తమ సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం ఆ ఫలితాన్ని త్వరలోనే చవిచూస్తుందని అంగన్వాడీలు హెచ్చరించారు. 8 రోజులగా చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం సమ్మె శిబిరాల వద్దే వాంటావార్పు చేపట్టారు. పలుచోట్ల భిక్షాటన చేశారు. ఇందులో భాగంగా పిడుగురాళ్లలోని బంగ్లా సెంటర్‌ వద్ద వంటావార్పులో సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులు నాయక్‌ మాట్లాడుతూ గత ఎనిమిది రోజులుగా అంగన్వాడీల రోడ్డెక్కి నిరసన తెలియజేస్తుంటే సిఎం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, నియంతాల వ్యవహరిస్తూ కేంద్రాల తాళాలు పగలగొట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే సమ్మె మరిత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. సమ్మెకు ఎఐటియుసి నాయకులు జె.కృష్ణ నాయక్‌, భారత్‌ బచావో జిల్లా కన్వీనర్‌ కోలా నవజ్యోతి, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ హజ్ర, డి.శాంతమణి, శివరంజని, సుజాత, వెంకటరమణ, సువర్ణరాణి, శోభారాణి, జయశ్రీ, శివకుమారి, కవిత, భవాని, రమిజిను, స్వప్న పాల్గొన్నారు.

ప్రజాశక్తి – యడ్లపాడు :
మండల కేంద్రమైన యడ్లపాడులో నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం వంటావార్పు చేపట్టారు. వీరికి మద్దతుగా కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడారు. బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ పిల్లలను ఆలనాపాలనా చూసే అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. కనీస వేతనం, గ్రాట్యుటీ అమలుతోపాటు తలకు మించిన భారంగా మారిన యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పనిభారం పెంచగా స్థానిక రాజకీయ నాయకులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ప్రజాశక్తి – వినుకొండ :
స్థానిక సురేష్‌ మహల్‌ సమీపంలో ఏర్పాటుచేసిన సమ్మె శిబిరం వద్దకు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంత్‌రెడ్డి, కె.శివరామకృష్ణ, మదార్‌ వలి, రైతు సంఘం నాయకులు ముని వెంకటేశ్వర్లు, ఐద్వా నాయకులు నాసర్‌ బి, యుటిఎఫ్‌ మాజీ నాయకులు నాగేంద్ర మాస్టర్లు మద్దతు తెలిపారు. అనంతరం దీక్ష శిబిరం వద్ద నుండి అంగన్వాడీలు భిక్షాటన చేపట్టారు. నరసరావుపేట రోడ్డులోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుండి వినూత్న రీతిలో భిక్షాటన చేశారు. నరసరావుపేట రోడ్డు నుండి శివయ్య స్తూపం సెంటర్‌, ఆర్టీసీ బస్టాండ్‌, సురేష్‌ మహల్‌ రోడ్డు వరకు వివిధ వ్యాపార సంస్థల దుకాణాలు, కూరగాయలు పండ్లు బడ్డీ కోట్లు లాంటి చిరు వ్యాపారులను, ప్రజల వద్ద భిక్షాటన చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులోని ప్రయాణికులు సైతం తమకు సాయం చేసి అంగన్వాడీలకు మద్దతుగా నిలవాలని కోరారు. వినుకొండ ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని శావల్యాపురం, నూజెండ్ల, వినుకొండ, వినుకొండ టౌన్‌ మొత్తం 234 అంగన్వాడి కేంద్రాలు ఉండగా కార్యకర్తలు ఆయాలు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. బిక్షాటనలో సుమారు 300 మందికి పైగా పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద 20 నిమిషాల పాటు అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. హనుమంత్‌ రెడ్డి, అంగన్వాడి యూనియన్‌ జిల్లా కోశాధికారి ప్రసన్న, ఎఐటియుసి హెల్పర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సారమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మెలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సచివాలయ పంచాయతీ మున్సిపాలిటీ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలను తాళాలు పగలగొట్టించడం అన్యాయమన్నారు. న్యాయపోరాటం చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం బెదిరించాలని కొనుక్కోవడం దుర్మార్గం అన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యువిటి అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.ఐదు లక్షలకు పెంచాలని, జీతంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, వంట గ్యాసును ప్రభుత్వమే నేరుగా సెంటర్లకు సరఫరా చేయాలని, హెల్పర్ల ప్రమోషన్ల నిబంధనలు రూపొందించాలని కోరారు. సర్వీస్‌లో ఉండి మృతి చెందిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు షేక్‌ మున్ని, ఉమా శంకరి, నాగజ్యోతి, గాయత్రి, నిర్మల, శ్రీదేవి, కష్ణకుమారి పాల్గొన్నారు.

ప్రజాశక్తి – చిలకలూరిపేట :
స్థానిక పండరీపురంలోని సిఐటియు కార్యాలయం నుంచి ఎన్‌ఆర్‌టి సెంటర్‌ వరకు ర్యాలీ, అనంతరం వంటావార్పు చేపట్టారు. యూనియన్‌ సెక్టార్‌ డివిజన్‌ అధ్యక్షులు జి..సావిత్రి, సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. సమస్యలను పరిష్కరించకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఎ.పద్మ, పార్వతి పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు టి.ప్రతాపరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్‌.లూథర్‌, రిక్షా వర్కర్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షులు బి.కోటా నాయక్‌, ఐద్వా పట్టణ కార్యదర్శి పి.భారతి, ఎఐటియుసి నాయకులు పి.రామారావు, అఖిల భారత మహిళా సమాఖ్య కార్యదర్శి చేరుకుపల్లి విజయ నిర్మల మద్దతు ప్రకటించారు.

ప్రజాశక్తి – మాచర్ల :
అంగన్వాడీల సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ యరమల రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాగు చేయటం సరికాదన్నారు. అతి తక్కువ వేతనాలతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అంగన్‌వాడీలకు రూ.26 వేలు, హెల్పర్స్‌కు రూ.18వేలు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సెంటర్ల అద్దెలు, 2017 టిఎ బిల్లులు ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు. అనంతరం అంగన్‌వాడీలు రహదారిపై వంటావార్పు చేపట్టారు. నాయకులు ఉషారాణి, ఇందిరా, కె.పద్మావతి, కోటేశ్వరి, సుందరలీల, రుక్మిణి, మహలక్ష్మీ, శివపార్వతీ, జిజి భారు, రహేనా, చంద్రకళ, లీలావతి, వెంకటరమణ, నాగలక్ష్మీ, రాధ, హైమవతి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రజాశక్తి – నాదెండ్ల :
తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. నాయకులు కె.రమాదేవి, సిహెచ్‌ మాధవి, విజయలక్ష్మి, వెంకాయమ్మ, అంజలి, సామ్రాజ్యం, శిరీష పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సెంటర్ల తాళాలు పగలగొడుతున్న వారిపై కేసు నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ప్రజాశక్తి – అమరావతి :
తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం కొనసాగుతోంది. ఎఐటిసియుసి నాయకులు ఎం.శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడుతూ 8 రోజుల నుంచి శిబిరాల్లో పాల్గొంటున్న ఈరోజు ఆయా స్పృహ తప్పి కోల్పోయిందని, అనేక మందికి షుగర్లు బీపీలు పలసపడిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వంటావార్పు చేపట్టారు. సయ్యద్‌ మోదిన్‌ వలీ, రఫీ, డాక్టర్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. అంగన్వాడీలకు ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేశారు.

ప్రజాశక్తి – క్రోసూరు :
మండల కేంద్రమైన క్రోసూరులో వంటావార్పు చేపట్టారు. వీరికి మద్దతుగా కౌలురైతు సంఘం మండల కార్యదర్శి టి.హనుమంతరావు మాట్లాడారు. ప్రభుత్వం బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిస్తుంటే మరొకప్రక్క మంత్రి బొత్స సత్యనారాయణ ఆ విషయాన్ని సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదని విమర్శించారు.

ప్రజాశక్తి – సత్తెనపల్లి :
సచివాలయం సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి తెరవడం సరికాదని అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి అన్నారు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక పట్టణ సీఐ ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు గుజ్జర్లపూడి సుజాత, ఎస్‌.అహల్య, చాముండేశ్వరి, ధనలక్ష్మి, ఆశ జ్యోతి, ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని, రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె ఉమశ్రీ, డివైఎఫ్‌ఐ నాయకులు జడ రాజ్‌కుమార్‌, రైతు సంఘం మండల అధ్యక్షులు మక్కపాటి నరసింహారావు, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పొట్టి సూర్యప్రకాశరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు డి.అమూల్య, చేనేత కార్మిక సంఘం నాయకులు అనంత వెంకట్‌ నారాయణ పాల్గొన్నారు.

➡️