నిర్వాసిత రైతులకు నచ్చిన భూములే ఇవ్వాలి

మాట్లాడుతున్న శ్రీరామగిరి సర్పంచ్‌ సంతోష్‌కుమార్‌

ప్రజాశక్తి-విఆర్‌.పురం

పోలవరం నిర్వాసిత రైతులకు ఇచ్చే భూమికి భూమి వారికే నచ్చిన భూములే ఇవ్వాలని శ్రీరామగిరి సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడు తూ పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన భూమికి సంబంధించి విఆర్‌.పురం, బుట్టాయిగూడెం తహసీల్దార్ల ఆధ్వర్యాన ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు బాధిత రైతులను మండలంలోని శ్రీరామగిరి పంచాయతీ పరిధి చొక్కనపల్లి గ్రామానికి తీసుకొని వెళ్లి భూమిని చూపించారని తెలిపారు. అయితే ఆ భూమి తమకు నచ్చలేదని రైతులు స్పష్టం చేశారన్నారు. అయినా వినకుండా మేము చూశాం కాబట్టి తీసుకోవాలని ఒక ఎస్‌డిసి చెప్పడం చాలా దారుణమన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల మెప్పుకోసం రైతులను బెదిరించడం సరికాదని, ఈ చర్యలు తీవ్రంగా ఖండించారు. అధికారులు ఇప్పటికైనా రైతులకు నచ్చిన భూములను ఇవ్వాలని కోరారు. లేదంటే రైతులను తీసుకొని రోడ్డు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

➡️