నీరిచ్చే ఓట్లడుగుతామేనే హామీ ఏమైంది : టిడిపి

Mar 12,2024 23:44

విలేకర్లతో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పల్నాడు ప్రజలకు 70 ఏళ్ల కలగా ఉన్న వరికపూడిసెల నిర్మాణం టిడిపి ద్వారానే సాధ్యమవుతుందని ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు అన్నారు. మంగళవారం స్థానిక టిడిపి పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వరికపూడిసెల నిర్మాణానికి కొంత నిధులు కేటాయించినా వైసిపి అధికారంలోకి వచ్చాక పటించుకోలేదని అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు కూడా వరికపూడిసెల ప్రాజెక్ట్‌ను విస్మరించారని అన్నారు. ప్రస్తుతం రాజకీయ లబ్ది కోసం హడావిడిగా శంకుస్థాపనలు చేస్తున్నారని, ఒక్క ప్రొక్లైన్‌ తీసుకెళ్లి వైసిపి ఎమ్మెల్యేలు పెద్ద డ్రామా చేస్తున్నారని విమర్శించారు. పల్నాడు ఎమ్మెల్యేలు గత ఎన్నికల సమయంలో… అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని లేదంటే తాము ఓట్లు అడగబోమని ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుకు కేంద్రం నుండి అనుమతులు వచ్చేలా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కృ చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో పల్నాడులోని అన్ని స్థానాల్లోనూ టిడిపి గెలుస్తుందని చెప్పారు. ఎంపీ లావు శ్రీకృదేవరాయలు మాట్లాడుతూ నాగార్జున సాగర్‌ కుడి కాల్వ పరిధిలో 40 శాతం పంటలు ఇప్పటికే ఎండిపోయాయని, ఎవరు వస్తే తమకు న్యాయం జరుగుతుంతోనని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు చాలా మంది భయపడుతున్నారని, భయం వీడి , రాష్ట్రంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులు, రాజధాని అమరావతి గురించి నోరు విప్పాలని అన్నారు. వైసిపిలో ఉన్న 80 శాతం మందికి ఓటమి భయం పట్టుకుందన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం మొత్తం మీద వరికపూడిసెల ప్రాజెక్ట్‌కు ఎక్కువగా అనుమతులు తెచ్చానని, ఏది జరిగినా ఒక్కడి వల్ల కాదని అన్నారు. టిడిపి నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందుబాబు మాట్లాడుతూ పల్నాడు ప్రజలను మరోసారి దగా చేసేందుకు వరికపూడిసెల పనులు ప్రారంభం అంటూ వైసిపి నాయకులు సిద్ధమయ్యారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వరికెపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టిడిపి డాక్టర్‌ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.దారునాయక్‌, నాయకులు వెన్నా సాంబశివరెడ్డి, కె.లలిత్‌ సాగర్‌, కె.కిరణ్‌, ఆర్‌.జగ్గారావు, సిహెచ్‌.ఆంజనేయులు, కె.హనుమంతరావు పాల్గొన్నారు.

➡️