నూతన ఆవిష్కరణలు వెలుగులోకి తేవాలి

Dec 19,2023 23:41
ఆవిష్కరణలను వెలుగులోకి

ప్రజాశక్తి – గండేపల్లి

యువ ఇంజనీర్లు తమ సృజనాత్మక ఆలోచనలకు పదునుపెట్టి నూతన ఆవిష్కరణలను వెలుగులోకి తేవాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో స్మార్ట్‌ ఇండియా హేక్‌థాన్‌ 2023 గ్రాండ్‌ ఫినాలే ఉత్సాహంగా మంగళవారం ప్రారంభమైంది. దేశమంతటా 47 నోడల్‌ కేంద్రాల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. న్యూఢిల్లీలో ప్రారంభమైన కార్యక్రమానికి ఎఐసిటిఇ ఛైర్మన్‌ ప్రోఫెసర్‌ టిజి.సీతారాం అధ్యక్షత వహించారు. ఆదిత్య క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ”యుక్తి” అంకుర సంస్థ వ్యవస్థాపకుడు ప్రణవ్‌ దీక్షిత్‌, ఐ4సి కంపెనీ మేనేజర్‌ సౌరభ్‌ ఉబాలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ ఇంజనీర్లు మంగళవారం ఉదయం నుంచి బుధవారం రాత్రి వరకూ నిర్విరామంగా తమ సృజనాత్మక ఆలోచనలకు పదునుపెడుతు నూతన ఆవిష్కరణలు ప్రపంచం ముందుకు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా ఉన్న భావి ఇంజనీర్ల ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఆదిత్య ఇంజనీరింగ్‌ కాలేజీలో దేశం నలుమూలల నుంచి 89 మందితో కూడిన మొత్తం 27 బృందాలు పాల్గొన్నాయి.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కో. ఆర్డినేటర్‌ ఎ.లక్ష్మణరావు, డీన్‌ డాక్టర్‌ ఎస్‌.రమాశ్రీ, డీన్‌.జెడి.వెంకటేష్‌, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.బెంగుళూరులో ఆదిత్య విద్యార్థులుసూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ఐటి విభాగం విద్యార్థులు స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2023 గ్రాండ్‌ ఫినాలే పోటీల్లో పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ కళాశాల విద్యార్థులు ఎన్‌.శ్రీను వినరు కుమార్‌, ఎవి.సత్యగంగా వేణి, ఎన్‌.చక్రవర్తి, ఎన్‌బిఎన్‌ ఎస్‌.గౌతమ్‌, వై.నిష్కల, పి.సంతోష్‌ మణికంఠ పాల్గొన్నారని, మెంటర్‌గా ప్రొఫెసర్‌ ఎకె.చక్రవర్తి వ్యవహరిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు తమ ప్రాజెక్టు నందు స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ ఆన్‌లైన్‌ పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌ రికమండేషన్‌/ట్యూటరింగ్‌ టూల్‌, సెర్చ్‌ ఫర్‌ బెస్ట్‌ టీచర్‌ ఫర్‌ స్పెసిఫిక్‌ టాపిక్‌ అనే అంశంపై కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

➡️