నెల విడిచి సాము

Dec 16,2023 20:28

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  బలవంతుని నాకేమని నిగ్రహించి పలుకుటమేల… బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ… అన్నాడు ఓ పద్యకవి. అచ్చంగా ఆ తీరును సిఎం జగన్మోహన్‌రెడ్డి, వైసిపి ప్రభుత్వం వంట బట్టించుకోవాల్సిన అవసరం ఉందని చాలా మంది జనం అభిప్రాయపడుతున్నారు. రెప్పపాటులో ఒక్క కాటుతో సమస్త జీవరాసుల ప్రాణాలను తీయగల శక్తి సామర్థ్యాలు విషసర్పానికి ఉంటాయి. అంతమాత్రాన తనను మించిన జీవరాశి లేదనుకుంటే పొరపాటే. విష సర్పమైనా చలి చీమలు కూడా చుట్టుముడితే చావాల్సిందే. ఇక్కడ చావు, బతుకుల సమస్య కాకపోయినప్పటికీ ఓవైపు అంగన్‌వాడీల ఆకలి కేకలు, అభద్రతా భావాలు, హక్కులు, అక్రోశాలు… మరోవైపు ప్రభుత్వ అధికార దుర్పం. అధికార దుర్వినియోగం. పదవీగర్వం మధ్య పెనుగులాట జరుగుతోంది. పదవులు, అవి ఇచ్చిన అధికారం గొప్పవే. కానీ, గొప్ప తనం కల్పించింది మాత్రం ప్రజలు, వారికి సేవచేస్తున్న ఉద్యోగులు, స్కీమ్‌ వర్కర్లు. ఈ విషయం మరిచిపోతే నేల విడిచి సాముచేసినట్టే లెక్క. ప్రభుత్వం ఇటువంటి లెక్కలనే మర్చిపోతున్నట్టుగా కనిపిస్తుందని జనం చర్చించు కుంటున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు గత ఐదురోజులుగా రాష్ట్ర వ్యాప్తంగాను, జిల్లాలోను సమ్మె చేస్తూ శాంతియుతంగా నిరసన దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వారేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ఎన్నికలకు ముందుకు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నారు. గౌరవ ప్రదంగా బతుకీడ్చేందుకు తెలంగాణాలోని అంగన్‌వాడీల కన్నా ఎక్కువ వేతనాలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే కోరుతున్నారు. బిల్లుల బాకాయి చెల్లించి అప్పుల ఊబినుంచి గట్టెక్కించమంటున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం బతుకుకీడ్చుకునేందుకు పింఛను రూపంలో భోరోసా కల్పించమని కోరుతున్నారు. ఊచ్‌ అంటే ఊడిపోయే విధంగా కాకుండా ఉద్యోగ భద్రత కల్పించమని వేడుకుంటున్నారు. అక్షరాల అంగన్‌వాడీ కోరికలు ఇవే. వీటన్నింటినీ నెరవేరుస్తామనిఅధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు సరికదా అంగన్‌వాడీలపై ఉక్కుపాదం మోపేందుకు బరితెగించింది. అధికారంలోకి వచ్చాక అనేక సార్లు అంగన్‌వాడీలను అరెస్టులు చేయడం, నిర్భందాలకు పాల్పడడం, బెదరింపులకు దిగడం తెలిసిందే. ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ఇటీవల సమ్మె నోటీసు ప్రభుత్వానికి ఇచ్చారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈనెల 12నుంచి సమ్మెసైరన్‌ మోగించారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల కలెక్టరేట్ల వద్ద, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద రోజూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధర్నా, దీక్షలు, రాస్తారోకో, నల్లబ్యాడ్జీలు, కళ్లకి గంతలు కట్టుకోవడం వంటి రూపాల్లో నిరసన జ్వాల కొనసాగుతోంది. వీరికి రోజు రోజుకూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు,ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చర్చలకు ఆహ్వానించి, సానుకూలంగా స్పందించాల్సిన ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను సచివాలయం, ఐకెపి ఉద్యోగులతో తెరిపించేందుకు ఆదేశాలిచ్చింది. అధికారుల ఒత్తిడితో అక్కడక్కడ ఈ వ్యూహం నెరవేరినప్పటికీ మెజార్టీ కేంద్రాలు తెరుచుకోలేదు. పైగా ఈ పనులు తాము చేయలేముంటూ సచివాలయం, ఐకెపి ఉద్యోగులు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు అంగన్‌వాడీలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అంగన్‌వాడీలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం రేపు తమపై కనికరం చూపుతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకాస్తా లోతుగా ఆలోచించినవారు సమ్మెను విచ్ఛినం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఈ సమస్యలు ఉద్యోగులు, స్కీమ్‌ వర్కర్లు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా మంది ప్రభుత్వ చర్యలను దుయ్య బడుతున్నారు. సమస్యలు పరిష్కరించకుండా ఒకిరిపనులు ఒకరికి అప్పగిస్తే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని, తద్వారా రాజకీయంగా నష్టం జరుగుతుందని చెప్పు కుంటున్నారు. ఆ మాట కొస్తే చరిత్ర కూడా ఇదే. ప్రభుత్వ వ్యవస్థలో అంగన్‌వాడీల పాత్ర అత్యంత కీలకమైనది. క్షేత్ర స్థాయిలో జనాలను ప్రభావితం చేయగల సత్తా అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉంది. ఈ విషయం గతంలో చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖరెడ్డి ప్రభుత్వాల్లోనూ రుజువైంది. చంద్రబాబు గుర్రాలతో తొక్కించడం, వైఎస్‌ఆర్‌ అరెస్టులతో ఇబ్బందులకు గురిచేయడం వంటి సందర్భాల్లో ఆయా ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తాజాగా అవే విషయాలను అంగన్‌వాడీలు, స్కీమ్‌ వర్కర్లు, ఇతర ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.

➡️