నేతలు కాదు.. విధానాలు మారాలి..

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు
ప్రజాశక్తి – మంగళగిరి :
మారాల్సింది నేతలు కాదని, ప్రభుత్వాల విధానాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ రామ్మోహన్‌రావు చిత్రపటానికి బాబూరావు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రేటర్‌ కార్పొరేషన్‌ పేరుతో స్థానిక సంస్థలకు ఎన్నికల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని, అమరావతి రాజధానిని ధ్వంసం చేసిందని విమర్శించారు. ఇప్పుడు మంగళగిరికి ఎమ్మెల్యేని కూడా లేకుండా చేసిందన్నారు. పంచాయతి, మున్సిపాల్టీలకు ఎన్నికల్లేకుండా ఈ నియోజకవర్గంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి చేశారని ప్రశ్నించారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి తెలియని పరిస్థితిలో ప్రజలున్నారని అన్నారు. నియోజకవర్గానికి రూ.1250 కోట్లు విడుదల చేశామంటూ సిఎం ప్రకటించారేగాని ఆచరణలో రూ.138 కోట్లే విడుదల చేశారన్నారు. నేతలను మార్చారని నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు కొంతమంది సంబరాలు చేసుకోవడం, కొంతమంది నిరసనలకు దిగడం చూస్తుంటే ఇదంతా అధికారపార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప జనం కోసం కాదన్నారు. సిపిఎం మాత్రం ప్రజల సమస్యలు ఎజెండాగా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందని చెప్పారు. ఇళ్లేసుకుని నివాసం ఉంటున్న తమకు ఇంటి పట్టాలివ్వాలని పేదలు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారని, ఈ సమస్య నేతలకు పట్టదా? అని న్రపశ్నించారు. సిపిఎం ఎమ్మెల్యేగా నిమ్మగడ్డ రామ్మోహన్‌రావు వ్యవహరించిన సందర్భంలో అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా సిపిఎం నాయకులు ఎన్నికైన సందర్భాల్లోనే అనేక గ్రామాల్లో, మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో సమస్యలను పరిష్కరించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి సిపిఎం కృషి చేస్తుందన్నారు. ఇటీవల మూడు రాష్ట్రాల్లో బిజెపి విజయానికి కాంగ్రెస్‌ అవలంబిస్తున్న విధానమే కారణమన్నారు. బిజెపి గెలుపు దేశానికి ప్రమాదకరమని, మతాలు, కులాల మధ్య వివాదాలు పెట్టి ఆ పార్టీ గెలుస్తోందని విమర్శించారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది ప్రజలు ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసం ఉంటున్నారని, ఏళ్ల తరబడి జీవిస్తున్నా వారికి పట్టాలివ్వడం లేదని విమర్శించారు. ఇళ్ల పట్టాల సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని చెప్పారు. దీంతోపాటు స్థానిక సమస్యలపైనా పోరాడతామన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.భావన్నారాయణ ఇంటి పన్ను, విద్యుత్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా పెంచుతోందని, వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి, ఈమని అప్పారావు, మంగళగిరి, తాడేపల్లి పట్టణ కార్యదర్శులు వై.కమలాకర్‌, బి.వెంకటేశ్వర్లు, దుగ్గిరాల మండల కార్యదర్శి జె.బాలరాజు, సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, జొన్న శివశంకరరావు పాల్గొన్నారు.

➡️