న్యూ ఇయర్‌ సందడి

Dec 31,2023 21:53
జిల్లాలో న్యూ ఇయర్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి

జిల్లాలో న్యూ ఇయర్‌ సందడి నెలకొంది. 2024కు యువత ఉత్సాహంగా స్వాగతం పలికింది. న్యూ ఇయర్‌ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి వస్త్ర వ్యాపారాలు, స్వీట్స్‌ షాపులు, బిర్యానీ పాయిం ట్‌లు కిట కిటలాడాయి. జిల్లా కేంద్రమైన రాజమహేం ద్రవరంలోని మెయిన్‌ రోడ్డు కొనుగోలుదారులతో సందడి నెలకొంది. న్యూ ఇయర్‌ నేపథ్యంలో వ్యాపా రులు భారీ ఆఫర్లతో ప్రజలను ఆకర్షించారు. స్పాట్‌ గిప్టు, లక్కీ డ్రా కూపన్లు అందించి కొనుగోలు దారులను ఆకట్టుకున్నారు. బస్‌కాంప్లెక్స్‌ ఏరియాలోని శుభమస్తు, మెయిన్‌ రోడ్డులోని బిఆర్‌కె, గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న సౌత్‌ ఇండియా షాపింగ్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రముఖ వస్త్ర దుకాణాల ఎదుట లక్కీ డ్రా కూపన్లు నింపేందుకు సైతం కొనుగోలుదారులు క్యూ కట్టారు. మరోవైపు ఫుడ్‌ వ్యాపారులకు డిమాండ్‌ పెరిగింది. రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లు నిర్వహించే వ్యాపా రులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. బిర్యాని కొంటే అరలీటరు కూల్‌ డ్రింక్‌ బాటిల్‌, రెండు బిరియానీలు కొంటే లీటరన్నర బాటిల్‌ ఉచితమంటూ రెస్టారెంట్ల నిర్వాహకుతుల ఆఫర్లు ప్రకటించారు. కొన్ని రెస్టారెం ట్లలో బిర్యానీ పార్శిళ్లపై రూ.50 నుంచి రూ.100 వరకు రేట్లు తగ్గించారు. నాన్‌వెజ్‌ ఐటమ్స్‌ విషయంలో ప్రత్యేకంగా టెంట్లు వేసిన విక్రయాలు చేపట్టారు. కేకులు కూడా అరకేజీ నుంచి 5 కేజీల వరకు జోరుగా విక్రయాలు జరిగాయి. వీటికి కూడా ప్రత్యేక ఆఫర్లు ఇచ్చారు. బిర్యాని పాయింట్‌, హోటళ్ళు కూడా 31వ తేదీ రాత్రి 1వ తేదీ కూడా భారీ ఎత్తులో డిస్కౌంట్లు, భోజన ప్రియులకు రుచికరమైన ఆహారపదార్ధాల ఆఫర్లను కూడా ప్రకటించారు. అదేవిధంగా పండ్లకు డిమాండ్‌ పెరగటంతో వ్యాపారులు ధరలు పెంచారు. యాపిల్స్‌, కమలాల ధరలు భారీగానే పెంపుదల చేశారు. వేమగిరిలోని పూల మార్కెట్లోనూ సందడి నెలకొంది. దీంతో రిటైల్‌ వ్యాపారులు ధరలు పెంచా రు. రాజమహేంద్రవరంలోని జాంపేట, కంబాల చెరు వు సెంటర్‌లలోని పూల దుకాణాలలో పూలబోకేలు చిన్నవి అయితే రూ.150, సైజులను బట్టి రూ.450 నుంచి రూ.600 వరకు విక్రయాలు జరిగాయి. చామంతులు కేజీ రూ.150 నుంచి 250కు చేరాయి. కనకాంబరాలు కేజీ రూ.200 నుంచి ఒక్కసారిగా 400 కు పెంచటంతో కొనుగోలు దారులు నిరాశ చెందారు. కేజీ రూ.250 ఉండే సూదిమల్లి ఆదివారం రూ.600కు పెరిగి పోయింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రంగులు వేసేందుకు ఇప్పటికే అనేక రంగులు అమ్మకాలు పెరిగాయి. మద్యం అమ్మకాలు సైతం జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే అర్థరాత్రి 12 గంటలకు మద్యం షాపులకు, ఒంటి గంట వరకూ బార్లకు అనుమతి ఇవ్వడంతో మందుబాబులు భారీగా క్యూ కట్టారు.

➡️