పంట నష్టపరిహా(ర)సం

తెనాలిలో మండలంలో నీటిలో తేలియాడుతున్న వరి (పైల్‌)
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
మిచౌంగ్‌ తుపాను వల్ల గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చేపట్టిన ఎన్యుమరేషన్‌ సోమవారం సాయంత్రం ముగిసింది. వివరాలను మంగళవారం నుండి సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. నిబంధనలను సాకుగా చూపి పంట నష్టంను తక్కువగా చూపేందుకు అధికారులు ప్రయత్నించినట్టు తెలిసింది. నిబంధనలు సడలించి రైతులను ఆదుకుంటామని సిఎం జగన్‌ హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో నిబంధనలు కఠినంగా అమలు చేశారు. రెండు జిల్లాల పరిధిలో 2.25 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాల్లో నిర్థారించారు. ఎన్యుమరేషన్‌లో మాత్రం కేవలం 1.40 లక్షల ఎకరాలలోనే నష్టం జరిగినట్టు అంచనాలకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేగాక కొన్ని పంటలు ప్రాథమిక దశలో ఉన్నందున పరిహారం రాదని కేవలం సబ్సిడీపై విత్తనాలు వస్తాయని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో 21 వేల ఎకరాలు,పల్నాడు జిల్లాలో 9 వేల ఎకరాల్లో శనగ పంటకు నష్టం జరిగింది. ఎకరాకు రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టిన శనగ రైతులకు నిరాశ మిగిలింది. పైరు ప్రాథమిక దశలో ఉన్నందున పరిహారం రాదని కేవలం ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 80 శాతం సబ్సిడీతో విత్తనాలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో శనగ రైతుల ఆందోళనకు గురవుతున్నారు. పల్నాడు జిల్లాలో 8500 ఎకరాలలో వరికి నష్టం జరిగింది. 2 వేల ఎకరాల్లో వరి పూర్తిగా నీట మునిగింది. మరో 6500 ఎకరాల్లో పంట నేలవాలింది. వరి పైరు పూర్తిగా పడిపోయినా పరిహారం రాదని చెబుతున్నారు. కంకులు బాగానే ఉన్నాయని నూర్పిడి చేస్తే మంచి దిగుబడి వస్తుందని అంటున్నారు. దీంతో రైతులకు అయోమయం పరిస్థితి ఏర్పడింది. పంట కోత ప్రయోగాల ఆధారంగా వచ్చిన దిగుబడి అంచనాలనే తుపానుకు నేలవాలిన వరికి కూడా వర్తింప చేయడం వల్ల పరిహారం వచ్చేలా లేదు. వరి సాగుకు ఎకరాకు రూ.30 వేలకు పైగా ఖర్చు అయింది. కౌలు రైతులకు మరో రూ.15 నుంచి 20 వేల వరకు అదనంగా ఖర్చు అవుతోంది. తుపాను వల్ల కోతలు, నూర్పిడికి యంత్రాల కొరత వల్ల ఖర్చు మరింత పెరిగింది. పల్నాడు జిల్లాలో 50 వేల ఎకరాల్లో పంటలకు తుపాను వల్ల నష్టం జరిగిందని అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్‌ తరువాత ఈ నష్టం కేవలం 35 వేల ఎకరాలకు కుదించినట్టు తెలిసింది. గుంటూరు జిల్లాలో వరి పంట 90 శాతం నీట మునగడం, నేలవాలడం జరిగింది. ఇందువల్ల 90 శాతం వివరాలు నమోదు చేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి వత్తిడి వచ్చింది. కానీ అధికారులు నిబంధనల మేరకు నమోదు ప్రక్రియ చేపట్టారు. వాస్తవంగా ఒక్క రోజు అతి భారీ వర్షం కురిసినా పెద్దగా నష్టం లేదని, ఎక్కువ రోజులు వర్షం కురిస్తే అధిక నష్టం జరిగేదని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మరో వైపు మేడికొండూరు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, చేబ్రోలు, పెదకాకాని, తాడికొండ తదితర ప్రాంతాల్లో అధిక వర్షం వల్ల పత్తి,మిర్చికి ఎక్కువ నష్టం జరిగింది. అయితే పత్తి పంట కేవలం 2500 ఎకరాల్లోనే నష్టం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా ఎన్యుమరేషన్‌ నిర్వహణలో జాప్యం కారణంగా పత్తికి జరిగిన నష్టాన్ని అధికారులు గణించలేకపోయారని వర్షం కురిసిన 10 రోజుల తరువాత వస్తే వారికి ఏం కనబడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాయ, పూత రాలిపోయింది. పత్తి నాణ్యత తగ్గింది. పత్తి నేలవాలింది. అయినా నష్టం నమోదు కాలేదు. ఎన్యుమరేషన్‌ వివరాలు మదింపు చేస్తున్నామని మంగళవారం ఉదయం కల్లా సచివాలయాల్లో జాబితాలను ప్రచురించాల్సి ఉన్నందున జిల్లా స్థాయిలో గణాంకాల మదింపు ఇంకా పూర్తి కాలేదని అధికారులు సోమవారం రాత్రి తెలిపారు.

➡️