పంట నష్ట గణనకు మీనమేషాలు

Dec 9,2023 20:22

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  పంట నష్ట గణనకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. విజయనగరం ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం తుపాను నేపథ్యంలో పంటల పరిశీలన పేరిట తెగేసి తిరిగేస్తున్నారు. ఆ పేరుతో తీసుకున్న ఫొటోలు, వీడియోల పరంపర సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయిస్తున్నాయి. బహుశా రైతులకు అండగా నిలిచామన్న భరోసా ఇవ్వదలచుకున్నారేమో. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదన్నది రైతుల నుంచి వినిపిస్తున్న మాట. ఇందుకు కారణం లేకపోలేదు. పంటనష్ట గనణపై ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. దీంతో, వ్యవసాయ శాఖ సిబ్బంది ఆ పనిలో లేరు. కనీసం పంటలు ఎంత మేర నీటిలో మునిగాయన్న అంచనాలు కూడా వ్యవసాయ శాఖ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని సాక్షాత్తు వ్యవసాయ శాఖ అధికారులే చెబుతున్నారు. కానీ, రైతుల ఓదార్పు యాత్ర మాత్రం కొనసాగుతోంది. ధ్వంద నీతిని ప్రజలు, ముఖ్యంగా రైతులు గమనిస్తునే ఉన్నారు. పంటనష్ట గణనపై ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు అందకపోతే ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ తదితర ప్రజాప్రతినిధులు ఎందుకు ఒత్తిడి చేయడం లేదో అంటూ రైతుల్లో చర్చనడుస్తోంది. కలెక్టర్‌ మాత్రం 9వ తేదీ నుంచి పంటనష్ట గణన ఉంటుందని చెప్పారు. చెరువులో చేపలు చెల్లిపోయాక కొంగలు వచ్చి ఏం చేస్తాయి అన్న సామెతలా పంటముంపును గుర్తించకుండా, నీరు తగ్గిపోయాక పొల్లాల్లో తలబడి లెక్కించేస్తామంటే నష్టం ఏమిటో ఎలా తెలుస్తుంది అని పలువురు రైతులు, రైతు సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంగతి కాస్త పక్కనబెడితే జిల్లాలో తుపాను కారణంగా మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు వరి, మొక్కజొన్న, పత్తి, అపసరాల పంటలు నీట మునిగాయి. తీవ్ర నష్టం వాటిల్లింది. వాటిని కాపాడుకునేందుకు రైతుల యాతన వర్ణణాతీతం. పావలా వాటా కూడా చేతికందే పరిస్థితి లేదని కొందరు, 50శాతానికి మించి చేతికి వచ్చే పరిస్థితి లేదని ఇంకొందరు, ఆయా గ్రామాల్లో వరద ప్రభావాన్ని బట్టి చెబుతున్నారు. మరోవైపు అక్టోబర్‌లో ఏర్పడిన నీటి ఎద్దడి సుమారు లక్ష ఎకరాల్లో పంటలను ఎండబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో, రైతుల పెట్టుబడి రెట్టింపు అయినా, దిగుబడి ఆశాజనకంగా వచ్చినా తుపాను వేసిన కాటుకు సగానికి సగం కూడా చేతికి అందని పరిస్థితి దాపురించింది. నీటి ఎద్దడి ఎదుర్కొన్న సమయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల నోట కరువు జిల్లాగా ప్రకటించాలన్న మాట రాలేదు. ఇప్పుడు పంటనష్ట గణనకు మీనమీషాలు లెక్కిస్తున్నా రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వ చెవులకు ఎక్కించే ప్రయత్నం చేయలేదు. దీంతో, రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం తప్ప రైతులకు మేలు చేసేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఏమాత్రం ఒత్తిడి చేయలేదని, ప్రభుత్వం చెబుతున్న సాంతికేక కారణాల సాకులకు తలూపడమే మిగిలిందని జనం చర్చించుకుంటున్నారు. పైగా కోత కోసిన వరిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోబోదంటూ సాక్షాత్తు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాజన్నదొర చేసిన ప్రకటన రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే 70శాతం వరి కోతలు పూర్తయ్యాయి. ఇందులోనూ ఎక్కువ భాగం ఇంకా పొలాల్లోనే ఉంది. అపార నష్టం వాటిల్లింది. తమకు బాధ్యత లేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరించడం వెనుక రైతులను పంగనామాలు చూపించేందుకు ప్రయత్నించడమేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వానికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని జనం నోట వినిపిస్తున్న మాట.

➡️