పండగపూటా రోడ్డుపై నిలబెట్టిన ప్రభుత్వం

గుంటూరు శిబిరంలో డోలక్‌లు వాయిస్తున్న అంగన్‌వాడీలు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్‌వాడీల నిరవధిక సమ్మె ఆదివారంతో 13వ రోజుకు చేరుకుంది. సెలవు రోజైనా అంగన్‌వాడీలు సమ్మె శిబిరానికి వచ్చి నిరసన తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలోనే కేక్‌ కట్‌ చేసి సెమీ క్రిస్మస్‌ నిర్వహించారు. అనంతరం డోలక్‌లు వాయిస్తూ, పాటలు పాడుతూ నిరసన తెలిపారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నగర ప్రధాన కార్యదర్శి టి.రాధ, తదితరులు బుర్రకథ కళాకారుల వేషధారణతో అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్థానాలను వమ్ము చేసిన తీరును వివరిస్తూ బుర్రకథ ప్రదర్శన నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజ, టి.రాధ మాట్లాడుతూ ఇప్పటికే నిరవధిక సమ్మె చేపట్టి దాదాపు రెండు వారాలు కావస్తోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నగర తూర్పు ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు చిన్న వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు మద్దతుగా స్థానిక వెంకటాద్రిపేట నుండి సంజీవయ్య నగర్‌ రైల్వే గేటు వరకూ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, అంగన్‌వాడీలు, మున్సిపల్‌ వర్కర్లు పాల్గొన్నారు. ఆర్టీసి కాలనీలోని ధనం హోటల్‌ సెంటర్‌లో పిల్లలు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు.

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని గాంధీ పార్కు వద్ద సమ్మె శిబిరం కొనసాగుతోంది. సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు సృష్టించినా అంగన్వాడీలు అదరకుండా బెదరకుండా సమ్మె కొనసాగిస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.26 వేలు వేతనం అమలు చేయాలని, అప్పటి వరకూ తెలంగాణ కంటే అదనంగా జీతమిస్తామని హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సచివాలయ, ఇతర సిబ్బందిని అంగన్వాడీ విధులు నిర్వహించాలని ఆదేశిస్తున్నా వారు విముఖుత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల గత పోరాట చరిత్రను తెలుసుకోవాలని, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటూనే అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలు ఆదివారం, పండుగ అని ఏమీ లేకుండా తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి నినదించడం వారి పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. ఎఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌, నాయకులు, నిర్మల, మాధవి, కవిత, ఎఐటియుసి రాష్ట్ర సహాయ కార్యదర్శి హెల్డా ఫ్లారిన్స్‌, నాయకులు శోభారాణి, విజయ కుమారి, విజయలక్ష్మి, యు.రంగయ్య, వి.వెంకట్‌, జె.వెంకటేశ్వర్లు, డి.వరహాలు పాల్గొన్నారు.

➡️