పండగ పూటా పస్తులేనా?

అనకాపల్లి కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న పంచాయతీ కార్మికులు

ప్రజాశక్తి-అనకాపల్లి

అనకాపల్లి జిల్లాలో గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు ,గ్రీన్‌ గార్డుల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం అనకాపల్లి కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద ఏపీ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో నెలకు 3000 నుండి 6000 రూపాయల వేతనాలతో ప్రభుత్వం పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు, గ్రీన్‌ గార్డులతో పనిచేయించు కుంటుందన్నారు. నేటికీ మూడు నెలల నుండి 13 నెలలుగా జీతాలు రాని పంచాయతీలు జిల్లాలో అనేకం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే అరకొర జీతం కూడా నెలల తరబడి చెల్లించకపోవడంతో పంచాయతీ కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కరోనా కాలంలో పారిశుధ్య కార్మికుల్ని దేవుళ్లగా పొగిడిన ప్రభుత్వాలు నేడు జీతాలు ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నాయని న్నారు. అనారోగ్యం పాలైన పారిశుధ్య కార్మికుల్ని ఆదుకునే దిక్కేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లీచింగ్లు పడి శరీరం గాయాల పాలవుతున్నారని, గతంలో యూనిఫామ్‌, చెప్పులు, సభ్యులు, గ్లోవ్జులు ఇచ్చేవారని నేడు ఎటువంటి రక్షణ పరికరాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, యూనియన్‌ అధ్యక్షులు పలివెల చిన్నారావు, జిల్లా నాయకులు ములకలపల్లి అప్పలరాజు, మహేష్‌, అప్పారావు, ఈశ్వరరావు ,విజరు కుమార్‌, మహేష్‌ ,పరదేశి, చందర్రావు, సన్యాసినాయుడు, దేవుడు పాల్గొన్నారు.పారిశుద్య కార్మికుల నిరసనగొలుగొండ: మండలంలోని ఏజెన్సీ లక్ష్మీపురంలో పారిశుద్య కార్మికులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తమకు ఇస్తున్న రూ.6వేల జీతాన్ని రూ.18వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విధుల్లోకి చేరేది లేదని స్పష్టం చేశారు.

➡️