పండుగ మీకు… పస్తులు మాకా.!

Dec 25,2023 23:01
పండుగ

ప్రజాశక్తి- యంత్రాంగం
సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె జిల్లాలో కొనసాగుతోంది. క్రిస్మస్‌ రోజునా వారు సమ్మెలో పాల్గొన్నారు. సోమవారం నాటికి ఈ సమ్మె 14వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ప్లకార్డులను ప్రదర్శించారు. సమ్మె శిబిరం వద్దే క్రిస్మస్‌ కేకులు కట్‌ చేశారు. రాజమహేంద్రవరంలో అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. అంగన్‌వాడీలను రోడ్డుపాలు చేసిన జగన్‌ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ అన్నారు. సమ్మెలో భాగంగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ వేడుకలు జరిపారు. కేకుపై ‘పండుగ మీకు పస్తులు మాకా’ అనే స్లోగన్‌ రాసి కేక్‌ కట్‌ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని ఇతర సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాజమండ్రి ప్రాజెక్టు అధ్యక్షులు కె.శారద మాట్లాడారు. 14 రోజులుగా అంగన్‌వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం దున్నపోతుపై వాన పడిన చందంగా చోద్యం చూస్తుందన్నారు. లక్షలాది మంది లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నా సర్కారుకు పట్టడం లేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గతంలో మాదిరిగానే మరల రోడ్లు పెట్టుకుని తిరిగేలా అంగన్‌వాడీలు చేస్తారని హెచ్చరించారు. ఇప్పటివరకు పోరాటం శాంతియుతంగా సాగిందని ఇకపై ఉధృతం అవుతాయన్నారు. సెంటర్ల తాళాలు పగలగొట్టి అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించినా, నిర్వహించలేక ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు రాణి, శేశారత్నం, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. చాగల్లు తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో అంగన్‌వాడీలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. సమ్మెలో భాగంగా మానవహారం చేపట్టారు. అంగన్‌వాడీ నాయకులు కె.లక్ష్మి మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఐసిడిఎస్‌కి నిధులు మంజూరు చేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. సమ్మెలో నిరసన కార్యక్రమం మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కె.లక్ష్మి, కె.దమయంతి, ఎ.శ్రీదేవి, ఎస్‌.అరుణకుమారి పాల్గొన్నారు. పెరవలి మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె శిబిరం కొనసాగుతోంది. ఈ సందర్భగా పలువురు మాట్లాడారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలోనే క్రిస్మస్‌కేక్‌ను కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ కార్యదర్శి కె.కృష్ణవేణి, సహాయ కార్యదర్శి బి.నాగవేణి, సెక్టార్‌ లీడర్స్‌ సిహెచ్‌.విశాలి వి.నిర్మలకన్యాకుమారి, బి.రామలక్ష్మి, పి.లక్ష్మీదుర్గ పాల్గొన్నారు. గోకవరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలకు టిడిపి నాయకులు సోమవారం మద్దతు తెలిపారు. క్రిస్మస్‌ సందర్భంగా వారు అంగన్‌వాడీలకు ఐదు కేజీల కేక్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు మాట్లాడారు. అంగన్‌వాడీల న్యాయమైన సమస్యను పరిష్కరించాలన్నారు. సచివాలయం సిబ్బందితో అంగన్‌వాడీ కేంద్రాలను నడిపించడం తగదన్నారు. అంగన్‌వాడీలను బానిసలుగా చూస్తున్న ఈ సర్కారును త్వరలోనే ఇంటికి సాగనంపుతారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మంగరౌతు రామకృష్ణ, కన్నబాబు, పాలూరి బోసుబాబు, గునిపే భరత్‌, ఈది అశోక్‌, గూండా శివప్రసాద్‌, పోసిన ప్రసాద్‌ తదితరులు ఉన్నారు. కొవ్వూరులో క్రిస్మస్‌ రోజునూ అంగన్‌వాడీలు ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సమ్మెను నిర్వహించారు. క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి నిరస తెలిపారు. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యంబ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు మాట్లాడారు. అంగన్‌వాడీలను వైసిపి సర్కారు బానిసలుగా చూస్తుందన్నారు. కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయిస్తుందన్నారు. హామీలను అమలు చేయమని అడిగితే బెదిరింపులకు దిగుతుందన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ సమ్మెను విరమించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధ్యక్షులు సిహెచ్‌విఎల్‌.పుష్పవతి, బి.పద్మజ, ఎ.నరసమాంబ, వి.శ్రీదేవి, ఎన్‌.శాంత కుమారి, డి.అమరావతి, ఎమ్‌జిఎం.మహాలక్ష్మి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️