పగలగొట్టడాలు.. ప్రతిఘటనలు..

మంగళగిరిలోని అన్నపూర్ణ థియేటర్‌ సమీపంలో అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టకుండా అడ్డుకుంటున్న సిపిఎం నాయకులు, స్థానికులు, అంగన్వాడీ కార్యకర్తలు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లా విలేకర్లు : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేంద్రాల వద్దకు వెళ్లిన అధికారులను సిఐటియు, సిపిఎం నాయకులు అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల అధికారుల చర్యలను ఖండిస్తూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. మంగళగిరి పట్టణంలో 8 సెంటర్లో ఆదివారం సాయంత్రం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడానికి వీఆర్వో, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడి సూపర్వైజర్‌ ఆధ్వర్యంలో ప్రయత్నించారు. కొన్ని సెంటర్లో తాళాలు పగలగొట్టి అందులోని రికార్డులను, సరుకులను స్వాధీనం చేసుకున్నారు. అన్నపూర్ణ థియేటర్‌ సమీపంలోని అంగన్వాడి కేంద్రం వద్ద తాళాలు పగలగొట్టడాన్ని అంగన్వాడీలు, సిపిఎం నాయకులు అడ్డుకుని రెండు గంటలపాటు నిలువరించారు. పట్టణ ఎస్‌ఐ బి.మహేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చిన తాళాలను వేయించడానికి ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, నాయకులు ఎం.బాలాజీ, ఆ ప్రాంత ప్రజలు, అంగన్వాడీ టీచర్‌, ఆయాలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత తలెత్తింది. చాలా సేపటి తర్వాత సచివాలయ ఉద్యోగులు, వీఆర్వో వెనుదిరిగి వెళ్లారు. ఇదిలా ఉండగా ఈ కేంద్రం అద్దె భవనంలో నిర్వహిస్తుండగా ఇంటి యజమాని కలుగజేసుకుని ఎంత మంది వచ్చి తాళం వేస్తారని ప్రశ్నించారు. తలుపులకు ఏమైనా అయితే ఎవరు బాగుచేయిస్తారని అన్నారు. ఆత్మకూరులో అంగన్వాడి కేంద్రాల వద్దకు వచ్చి తాళాలు పగలగొడుతున్న సమయంలో స్థానిక నాయకులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ఎం.పకీరయ్య, జాన్‌బాబు, లవకుమార్‌, దుర్గారావు, మరియదాసు, పద్మనాభశర్మ, సుకుమార్‌, కృష్ణ, బాపనయ్య, అజరు కుమార్‌, కోటయ్య, సీతారామాంజనేయులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్‌ వడ్డేశ్వరం, కొలనుకొండ, ఇప్పటం, రాధా రంగా నగర్‌, తదితర గ్రామాల్లోని కేంద్రాల తాళాలను పగలగొట్టేందుకు అధికారులు పూనుకున్నారు. వడ్డేశ్వర సెక్టార్‌ పరిధిలోని ఆరు గ్రామాలలో కేంద్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సెక్టార్‌ సూపర్వైజర్‌ శిరమణి తెలిపారు. ఈ చర్యలను ఖండిస్తూ అంగన్వాడీలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులు వి.దుర్గారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సచివాలయం సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. ఈనెల 21 నుంచి మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లలనున్నట్లు తెలిసిందని, అప్పుడు వారి పని కూడా సచివాలయం సిబ్బందితో చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల మధ్య ప్రభుత్వం చిచ్చుపెడుతోందని, ఈ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిరసనలో ఎఐటియుసి నాయకులు టి.వెంటయ్య, సరళ, తబితా, కిరణ్మయి, మాణిక్యం, శ్రీదేవి, భవాని, సుజాత, లక్ష్మి, శోభా, వరలక్ష్మి, ఫాతిమా, మాధూరి పాల్గొన్నారు. పెదకాకాని మండలంలోని గొల్లమూడి, వెనిగండ్ల, పెదకాకానిలోని కేంద్రాల తాళాలలను పగలగొట్టేదుకు అధికారులు సిద్ధమవగా ఇది తెలిసిన సిఐటియు జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ, నాయకులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. తాడికొండ మండలంలోని 69 కేంద్రాల తాళాలను అధికారులు పగలగొట్టించారు.ఉండవల్లి కేంద్రం వద్ద అరెస్టులుతాడేపల్లి పట్టణ శివారులోని శివదుర్గాపురం అంగన్‌వాడీ కేంద్రం తాళాలను రెవెన్యూ అధికారులు పగులగొట్టేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలిసిన అంగన్‌వాడీలు, స్థానిక ప్రజలు సాయంత్రం వరకూ అంగన్‌వాడీ కేంద్రం వద్దే ఉన్నారు. సాయ ంత్రం 6.30 గంటలకు వారంతా వెళ్లిపోవడంతో సచివాలయ సిబ్బంది వచ్చి తాళాలు పగులగొట్టారు. అక్కడ నుంచి సిఎం నివాసానికి సమీపంలోని ఉండవల్లి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లారు. అప్పటికే అక్కడికి సిపిఎం, టిడిపి నాయకులు, అంగన్‌వాడీలు చేరుకోవడంతో వెనుదిరిగారు. అధికారులు అంగన్‌వాడీ కేంద్రం సమీపంలోనే మాటువేసి ఉండడంతో నాయకులు, కార్యకర్తలు, జనం కూడా అక్కడే ఉండి తాళాలు పగులగొట్టకుండా చూశారు. 10 గంటలకు పోలీసులు రంగ ప్రవేశం చేసి నాయకులను తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. దీన్ని నాయకులు ప్రతిఘటించే క్రమంలో ఉద్రిక్తత, తోపులాట తలెత్తి పలువురికి గాయాల య్యాయి. స్టేషన్‌కు తరలించబడిన వారిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.భాస్కరయ్య, రాజధాని డివిజన్‌ నాయకులు వి.వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు పి.జ్యోతిబసు, జి.బసివిరెడ్డి, కె.రమేష్‌, జనసేన నాయకులు ఎస్‌.నాగేశ్వరరావు, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.

➡️