పత్తి పంట అమ్ముకోవడానికి అగచాట్లు

సత్తెనపల్లి అమరావతి మేజర్‌ కాల్వ సమీపంలో ఉన్న జిన్నింగ్‌ మిల్లు ఎదుట బారులు తీరిన వాహనాలు
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
తమ పంటను అమ్ముకోవడానికి సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మిల్లు ఎదుట పత్తి రైతులు పడిగాపులు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కొనుగోలు చేయాల్సి ఉండగా అమరావతి మేజర్‌ కాల్వ సమీపంలో ఉన్న వెంకటరమణ జిన్నింగ్‌ మిల్లును సిసిఐ కేటాయించింది. ఈ మిల్లులో ఖాళీ లేకపోవడంతో పత్తి బోరాలతో వచ్చిన వాహనాలు మిల్లు ఎదుట రోడ్డుపై బారులు తీరాయి. పత్తి కొనుగోలు చేయకపోటంతో పంటను విక్రయించేందుకు వచ్చిన రైతులు మిల్లు ఎదుట పడిగాపులు పడుతున్నారు. సోమవారం తెల్లవారుజామున నుండే వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 35 వాహనాలు రోడ్డు మీద నిలిచాయి. సూమారు వెయ్యి బోరాలు రైతులు తీసుకొచ్చారు. పత్తి బోరాలు దిగుమతి కాకపోవటంతో వాహనదారులు వెయిటింగ్‌ చార్జీలు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌ యార్డులోనే పత్తి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. సిసిఐ బయ్యర్‌ రవిప్రసాద్‌ను వివరణ కోరగా జిన్నింగ్‌ మిల్లులో దిగుమతి చేసేందుకు ఖాళీ లేకపోవడంతో కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు.

➡️