పథకాల అమలులో లక్ష్యాలను అధిగమించాలి

ప్రజాశక్తి- రాయచోటి జిల్లాలోని సచివాలయాలలో జగనన్న ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి రెవెన్యూ, రీసర్వే మూడవ దశ, ఇనామ్‌, అసైన్డ్‌ భూములు, స్త్రీ, శిశు సంక్షేమం-ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పథకం, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ, కరువు మండలాల్లో వేతన ఉత్పత్తి, తాగునీరు సరఫరా, పది, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు, సిసిటివి ప్రాజెక్టు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రాయచోటి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆరఒ సత్యనారాయణ హాజరయ్యారు. విసి అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ రెవెన్యూ అంశంలో భాగంగా చుక్కల, ఇనాం భూములను మార్గదర్శకాల మేరకు పరిష్కరించాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు కనీస సౌకర్యాలు ఉండాలని ముఖ్యంగా ర్యాంపు, మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. జిల్లాలో మూడో దశ రీ సర్వేలో సుమారు 20 వేల పైగా ఎకరాలు సర్వే చేయాల్సి ఉందని, సదరు రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అంశంలో భాగంగా డేటా అందుబాటులో ఉన్న ప్రతి సచివాలయంలో కనీసం ఒక రిజిస్ట్రేషన్‌ అయిన తప్పని సరిగా చేయాలన్నారు. పంచాయతీ సెక్రెటరీలను రిజిస్ట్రేషన్‌ పటిష్టంగా నిర్వహించాలన్నారు. మహిళా శిశు సంక్షేమంలో భాగంగా గోరుముద్ద, పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అంశంపై సిపిడబ్ల్యూ పథకం వివాహంలో ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని వ్యవస్థను పటిష్టంగా నిర్వహించాలని చెప్పారు. ఇందుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో నీటి సరఫరా అంశంపై వాస్తవ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️