పనిభారం తగ్గించాలి

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర వ్యాప్తపిలుపులో భాగంగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ధర్నా చౌక్‌లో 36 గంటల నిరసనలు గురువారం ప్రారంభమయ్యాయి. గుంటూరలో నిరసనకు యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మీ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, టిడిపి జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. స్కీమ్‌ వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రభుత్వ ఓటమిని గుర్తెరిగి ఆశా వర్కర్ల సమస్యల పరిష్కరించాలన్నారు. ఆశాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళామని అన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ మహిళలకు ఉండే సాధారణ ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా వారాంతపు సెలవులు, మెడికల్‌ లీవులు, మెటర్నిటీ లీవులు, ఇతర పండుగ సెలవులు కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అన్నారు. ఎన్ని సమస్యలున్నా 365 రోజులూ పని చేయాల్సిందేనని, సెలవు మంజూరు కావాలంటే డాక్టర్‌, పిహెచ్‌సి సూపర్‌వైజర్‌, ఎఎన్‌ఎం ఇలా ముగ్గురి నుండి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వి.నరసింహారావు మాట్లాడుతూ ఆశాల ఆందోళనకు సిఐటియు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ప్రస్తుత నిత్యావసర సరుకుల ధరలతో పోల్చితే కనీస వేతనం రూ.26 వేలు ఉండాలని, కానీ ఆశా వర్కర్లకు అందులో సగం కూడా దక్కట్లేదని అన్నారు. పేరుకు పార్ట్‌టైమ్‌ వర్కర్లయినా ఫుల్‌టైమ్‌ పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని విమర్శించారు. తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆశాల సమస్యలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుభాగాన నిలిచి పనిచేశారన్నారు. అటువంటి ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. ఒకే పనిని రెండు రకాలుగా చేయిస్తూ పనిభారం పెంచుతున్నారన్నారు. ఒకే డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేయటంతోపాటు, రికార్డుల్లోనూ ఎక్కించాలని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఆన్‌లైన్‌గానీ, రికార్డు గానీ ఏదో ఒకటే చేయించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రిటైర్మెంట్‌ బెన్ఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని, ఇళ్ల స్థలం, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, మరణించిన ఆశాల కుటుంబంలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలని, ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రెటరీల నియామకాల్లో ఆశాలకు వెయిటేజి ఇవ్వాలని, డిమాండ్‌ చేశారు. కార్యక్రమానికి ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు వివికె సురేష్‌, అంగన్‌వాడీ యూనియన్‌ దీప్తి, కాంట్రాక్ట ఎక్ట్రిసిటీ యూనియన్‌ నాయకులు పవన్‌, రాంబాబు, బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు సాంబశివరావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జ్యోతి, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ధనలక్ష్మీ, జిల్లా కోశాధికారి లక్ష్మీ తదితరులు ప్రసంగించారు.

నరసరావుపేటలో నిరసనకు యూనియన్‌ జిల్లా సహాయకార్యదర్శి ఎం.భూలక్ష్మి అధ్యక్షత వహించారు. శుక్రవారం ధర్నా చౌక్‌ నుండి కలెక్టరేట్‌ వరకు నిర్వహించే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆశాలకు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలని, విధి నిర్వహణలో రూ.4 వేల వరకు అవుతున్న ఖర్చులు ప్రభుత్వం భరించాలని కోరారు. సర్వేల పేరుతో ఊపిరి సలపని పని ఇస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయన్నారు. చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించకుండా శ్రమ దోపిడీ చేస్తున్నాయన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌ మాట్లాడుతూ రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రక రకాల యాప్‌ల పేరుతో 24 గంటలు వెట్టిచాకిరి చేస్తున్నారని, వైద్య సిబ్బంది చేయాల్సిన అనేక రకాల పనులను బెదిరించి ఆశాలతోనే చేయిస్తున్నారని విమర్శించారు. మొబైల్‌ వర్క్‌కు సంబంధించి శిక్షణేమీ ఇవ్వకుండా 14 రకాల యాప్‌ల ద్వారా పనిచేయిస్తున్నారని, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సమస్యలున్నా, ఫోన్లు పని చేయకపోయినా ఆశా వర్కర్లను బాధ్యులుగా చేస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆశా వర్కర్లు చేసే ప్రతి పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని చెప్పారు. యూనియన్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు డి.శివకుమారి మాట్లాడుతూ పిహెచ్‌సికి పిలిపించిన ప్రతి సందర్భంలో టీఏ, డీఏలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సెల్‌ఫోన్లు పని చేయకపోవడంతో సొంత డబ్బులతో కొనాల్సి వస్తోందన్నారు. ఆన్‌లైన్‌ వర్క్‌తో పాటు 26 రకాల రికార్డులు రాయాల్సి వస్తోందని, వీటినీ ఆశాలే కొనాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. ప్రతిరోజు రిజిస్టర్లో సంతకాలు చేయాలని హెల్త్‌ క్లినిక్‌, సచివాలయంలో రోజంతా కూర్చోవాలని మిగిలిన సమయంలో ఫీల్డ్‌ వర్క్‌ చేయాలని వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక పలువురు గుండెపొటుతో చనిపోయిన సందర్భాలూ ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు డి.అమూల్య, కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.రామారావు, సిఐటియు నరసరావుపేట మండల అధ్యక్షులు సిలార్‌ మసూద్‌, రొంపిచర్ల మండలం కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరాజు, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్‌ మాట్లాడి పోరాటానికి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎం.రత్నకుమారి, ఎం.ధనలక్ష్మి, కె.బుజ్జి, భారీగా ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసన శిబిరంలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి టి.పెద్దిరాజు, కళాకారులు కె.నాగేశ్వరరావు తదితరులు గేయాలు ఆలపించారు.

➡️