పరిష్కారంలో కాలయాపన తగదు

Jan 11,2024 14:01 #West Godavari District

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ : తమ సమస్యలు పరిష్కరించకపోతే ‘మీ కుర్చీ తిప్పేస్తాం’ అంటూ మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుధవారం కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం నుంచి రాష్ట్రపతి రోడ్డు మీదుగా కుర్చీలను తిరగేస్తూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్‌ మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కామన మునిస్వామి, గుబ్బల గోపి, యూనియన్‌ నాయకులు మజ్జి కృష్ణబాబు, నీలాపు ఆదినారాయణ బాబు పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పట్టణంలో మున్సిపల్‌ కార్మికులు బుధవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 16 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా సమస్యలు పరిష్కరించకపోగా సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌, హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు ఎస్‌.సతీష్‌, దనాల రాజు, భాను, దయామని, దుర్గాప్రసాద్‌ నాయకత్వం వహించారు. సమ్మెకు ఐఎఫ్‌టియు జిల్లా సహాయ కార్యదర్శి దాన వరప్రసాద్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌ మాట్లాడుతూ కాంటాక్టు కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఐఎఫ్‌టియు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. భీమవరం రూరల్‌:మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం తగదని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో జగన్‌ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె 16వ రోజు సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద బుధవారం ఒంటి కాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడారు. వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు, ఎఐసిటియు జి.నాని, నేలపు రాజు, ఎస్‌కె నాగూర్‌ నాగమణి, సత్యనారాయణ, నేలపు అప్పన్న పాల్గొన్నారు.

➡️