పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం : డిఎంఒ

Feb 16,2024 21:25

 ప్రజాశక్తి – కొమరాడ  : డ్రైడే- ఫ్రైడే కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు అన్నారు. పరశురాంపురంలో డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. సిబ్బందితో కలిసి ఆయన గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ ఇంటి పరిసరాలు, కాలువల్లో పరిశుభ్రత తీరును పరిశీలించారు. గ్రామ సర్పంచ్‌, పంచాయతీ సెక్రటరీ, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో అక్కడ చేపట్టిన కాల్వల్లో పూడికతీత నిర్వహణను ఆయన గమనించారు. తద్వారా నీరు నిల్వ లేకుండా ఉంటుందన్నారు. డాక్టర్‌ జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న డ్రైడే కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యాన్ని అక్కడ ప్రజలకు వివరించారు. ఇళ్ల పరిసరాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండడం వల్ల అందులో దోమలు వృద్ధి చెందుతాయని, తిరిగి అవి మనకే పలు రోగాలకు కారణమవుతాయని అన్నారు. ముఖ్యంగా ఉపయోగంలో లేని వస్తువులు, పాడైన ప్లాస్టిక్‌ వస్తువులు, టైర్లు, కాలువల్లో చెత్తతో నిండి ఉండటం, ఫ్రిజ్‌ వెనుక భాగం ట్రేల్లో చేరిన నీరు మొదలగు వాటి వల్ల అక్కడ మలేరియా, డెంగీ, ఫైలేరియాకు కారణమయ్యే దోమలు వృద్ధి చెందుతాయని తెలిపారు. కావున పరిసరాలను ఎప్పటిక ప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో డ్రేడే కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి వారం పాటించేలా చైతన్యం కలిగించాలన్నారు. అనంతరం ఆయన హెల్త్‌ వెల్నెస్‌ కేంద్రంలో రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, పంచాయతీ సెక్రటరీ కె.అనిల్‌ కుమార్‌, వైద్య సిబ్బంది ప్రమీల, లత, రామకృష్ణ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️