పల్లెగూటికి పండగొచ్చింది

Jan 13,2024 20:18

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : దూర ప్రాంతాల్లో ఉంటూ పండగ నేపథ్యంలో ఇంటికి చేరుకునే కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు మనవళ్లతో పల్లెల్లో పండగ వాతావరణ నెలకొంది. ఇంటికి సున్నాలు, రంగులు వేయడం, గదులను శుభ్రం చేయడం, మూలపడిన మంచాలను, ఇతర సామగ్రిని సిద్ధం చేయడం ఇలా.. నెల రోజుల ముందే పండగ ప్రారంభమైంది. ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటిలోనూ ఆకర్షణగా ఉండే ఇత్తడితో తయారుచేసే బిందెలు, అండాలు, తదితర సామగ్రిని తళతళలాడుతూ మెరిసేలా చేయడం పెద్దపనిగా భావిస్తారు. గత 15 రోజులుగా ఏ పల్లెలో చూసినా అదే సందడి. హడావుడి.. ఇక పండగలో ఇంకో ప్రత్యేకత పిండివంటలు. అరిసెలు, చక్కిరాలు, బూరెలు, గారెలు వంటి వంటలు కూడా ముందుస్తుగానే తయారీ చేసుకున్నారు. భోజనాలతో తినడానికి అప్పడాలది పెద్దపాత్ర. వీటిని తయారు చేయడం సమిష్టి పని, వీటి కోసం ఇరుగు పొరుగు వారి సహకారం తీసుకుని తమ స్నేహాన్ని చాటుకున్నారు. పగటిపూట ఇంటి పనులు ముగించుకుని సాయంత్రం సమీప పట్టణాల్లో కొత్త బట్టలు కొనుక్కోవడం ప్రారంభం కావడంతో పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం మార్కెట్లు పల్లెజనాలతో కళకళలాడుతున్నాయి. ఏదేమైనా రెండు రోజుల్లో రంగుల ముగ్గులు, గంగిరెద్దుల సన్నాయిలు, హరిదాసుల కీర్తనలు, అక్కడక్కడా కోడిపందేలతో ప్రారంభం కానున్న సంక్రాంతి కళ పల్లెల గూటికి చేరిపోయింది.

➡️