పశు అంబులెన్స్‌లు ప్రతి గ్రామాన్నీ సందర్శించాలి

Jan 20,2024 00:32

సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలోని పశు అంబులెన్స్‌లు ప్రతి గ్రామాన్ని సందర్శించి పశుపోషణ, వ్యాక్సినేషన్‌, వ్యాధుల నివారణపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా పశుసంవర్ధక శాఖ అధికారులు షెడ్యూల్‌ రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన పశు అంబులెన్స్‌లు ఫిబ్రవరి నెలలో గ్రామాలను సందర్శించే తేదీల షెడ్యూల్‌ వెంటనే అందించాలని, ప్రతి ఆర్‌బికెలోనూ పశు అంబులెన్స్‌ గ్రామానికి వచ్చే తేదీ వివరాలను రైతులకు తెలియచేయాలన్నారు. రబీకి సంబంధించి ఈ-క్రాప్‌ బుకింగ్‌ ఫిబ్రవరి 15వ తేది నాటికి పూర్తి చేసి, 28వ తేదీ వరకు సోషల్‌ ఆడిట్‌ నిమిత్తం వివరాలను ఆర్‌బికెలలో ప్రదర్శించాలని, మార్చి 4వ తేదీలోపు అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితాను మార్చి 6వ తేదీ నాటికి ప్రచురించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు పంట రుణాలు బ్యాంకర్లు విరివిగా అందించేలా లీడ్‌ బ్యాంక్‌ మేనేజరు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. రబీకి సంబంధించి అవసరమైన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని, జిల్లాలో మంజూరు చేసిన స్పింకర్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌ యూనిట్ల ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లాకు సంబంధించి నాబార్డు పొటన్షియల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారుల నూతన సంవత్సర కేలండరు, డైరీలను జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ అధికారి రవీందర్‌, ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఉమామహేశ్వరరావు, ఎపీసీఎన్‌ఎప్‌ పీడీ రాజకుమారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు లక్ష్మీ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజరు మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️