పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి-కడప అర్బన్‌ జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించాలని కలెక్టర్‌ వి. విజరు రామరాజు డిఐఇపిసి సభ్యులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు విస్తతమైన అవకాశా లున్నాయని పేర్కొన్నారు. ఉన్న అవకాశాలను సద్వినియోగిస్తూ పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. పరిశ్రమలు జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అని తెలిపారు. ఆ దిశగా జిల్లాను పారిశ్రామికంగా అభివద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని విస్తతం చేసి, జిల్లా ఆర్థిక అభివద్ధితో పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలన్నారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రాత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లు సహకరించాలన్నారు. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహిక నూతన పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమల ప్రమోషన్‌కు సంబంధించి ఇంకా ఏవైనా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపణపై అవగాహన పెంపొం దించాలన్నారు. పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ జయలక్ష్మి సంబందిత వివరాలను సమావేశంలో కలెక్టర్‌కు వివరించారు. ఆయా అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. సమావేశంలో ఎపిఐఐసి జెడ్‌ఎం నాగరాజు, డిక్కీ కో-ఆర్డినేటర్‌ శివ శంకర్‌, ఎపిఐఐసి ప్రతినిధులు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇ, వాణిజ్య పన్నుల శాఖ, ఎపిఎస్‌ పిడీసీఎల్‌, లేబర్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️