పార్లమెంటులో ప్రస్థావించాలని వినతి

Jan 28,2024 21:03

ప్రజాశక్తి- చీపురుపల్లి : గత కొన్నేళ్లుగా బకాయి ఉన్న ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఇపియఫ్‌) సమస్యని పార్లమెంటులో ప్రస్థావించాలని ఆ సంఘం ప్రతినిధులతో పాటు సిఐటియు నాయకులు అంబళ్ల గౌరినాయుడు ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ దృష్టికి తీసుకు వెల్లారు. ఆదివారం ఎంపిని ఆయన నివాసంలో కలసి తమ సమస్యపై వినతి పత్రాన్ని అందజేసారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పాటు ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగి పోవడంతో తమకు వస్తున్న పెన్షన్‌ చాలడం లేదన్నారు. ప్రధానంగా తమకి పెన్షన్‌ కనీసం వెయ్యి రూపాయలు కూడా రావడం లేదని వివరించారు. దేశంలో సుమారు 75 లక్షల మంది వరకు ఇపియఫ పెన్షన్‌ దారులున్నారని తెలిపారు. 2023 మార్చి 31 నాటికి ఇపియఫ్‌ మిగులు నిధులు ఆరు లక్షల కోట్లు అని ఆ ఏడాది ఎంప్లాయిస్‌ నుండి కంట్రిబ్యూషన్‌ వచ్చినది 68 వేల కోట్లు రూపాయలు, మిగులు నిధులు మీద వచ్చిన వడ్డీ 50.5 వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా 8.5 కోట్లు వెరసి గత ఏడాది 1.28 లక్షల కోట్లు వచ్చిందని వారు ఎంపికి వివరించారు. అయితే గత ఏడాది తమకి పెన్షన్‌ రూపాంలో కేవలం 27 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. గతేడాది మిగులు లక్ష కోట్లు కాగా గతంలో ఉన్న 6 లక్షల కోట్లు వెరశి 7 లక్షల కోట్లు రూపాయల నుండి వచ్చిన వడ్డీ నుండి ప్రతీ ఒక్క పెన్షన్‌దా రునుకి రూ.10వేలు వరకు ఇవ్వొచ్చని వివరించారు. ఇపియఫ్‌ పెన్సన్‌ ఎజిటేషన్‌ కమిటీ జాతీయ నాయకత్వం కనీసం ఒక్కొక్క పెన్షన్‌ దారునికి రూ.7,500లతో పాటు డిఏ ఇచ్చేవిధంగాను, ఉచిత వైద్యం అందించే విధంగా పార్లమెంటులో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు. ఎంపిని కలసిని వారిలో గరివిడి మాజీ ఎంపిపి కొనిసి కృష్ణంనాయుడు, సంఘ నాయకులు, పాల్గొన్నారు.

➡️