పాలస్తీనాపై దాడులను తక్షణమే ఆపాలి

మాట్లాడుతున్న ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి చిష్టీ
ప్రజాశక్తి-గుంటూరు : పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయిల్‌ దాడులను తక్షణమే నిలిపివేయాలని వివిధ సంఘాల నాయకులు నాయకులు డిమాండ్‌ చేశారు. షహీద్‌ అష్పాఖుల్లాఖాన్‌, పండిత్‌ రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ 96వ వర్థంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక గుజ్జనగుండ్లలోని బికారీ కాంప్లెక్స్‌ మదర్సా వద్ద ఆవాజ్‌ ఆధ్వర్యంలో పాలస్థీనా సంఘీభావ సదస్సు నిర్వహించారు. ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌.కె.బాషా అధ్యక్షతన జరిగిన సదస్సులో అవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ.చిష్టీ మాట్లాడుతూ పాలస్తీనాలో మానవ హక్కులు హననం జరగుతోందన్నారు. మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఇజ్రాయిల్‌ దాడులకు పాల్పడుతోందని ఆవేదన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు అన్నం, నీళ్లు, కనీసం అత్యవసర మందులు కూడా అందకుండా అత్యంత అమానవీయంగా ఇజ్రాయిల్‌ వ్యవహరిస్తోందని విమర్శించారు. అమెరికా తన ఆయుధాల వ్యాపారం కోసమే ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై దాడులకు మద్దతుగా నిలస్తోందన్నారు. అనంతరం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు కె.నళినీకాంత్‌, జెవివి నాయకులు ఎమ్‌డి అక్భర్‌, సీనియర్‌ సిటిజన్‌ నాయకులు వేమారెడ్డి, విరసం నాయకులు సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తదితరులు ప్రసంగించారు. తొలుత పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌.సాబ్జి మృతికి సదస్సులో సంతాపం ప్రకటించారు. అనంతరం గుంటూరు నగర పశ్చిమ ఆవాజ్‌ నూతన కమిటీ ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా ఎస్‌.కె.ఖాసింవలి, అధ్యక్షులుగా సయ్యద్‌ మౌలాలి, ఉపాధ్యక్షులు ఎస్‌.కె.మస్తాన్‌వలి, కార్యదర్శి ఎస్‌.కె.బాషు, సహాయ కార్యదర్శి పఠాన్‌ ఖాదర్‌, ట్రెజరర్‌ ఎస్‌.కె.సుభామి, మరో 10 మందితో నూతన కమిటీని ఎన్నికైంది.

➡️