. పాసు పుస్తకం ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం

Dec 18,2023 19:53

ప్రజాశక్తి-విజయనగరం కోట  :  ‘ పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి, ప్రభుత్వ పథకాలు అందించాలని అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా న్యాయం చేయడం లేదు. నాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ నెల్లిమర్ల నగర పంచాయతీ బైరెడ్డివీధికి చెందిన తుర్ల అప్పలనర్సయ్య పురుగుమందు డబ్బా పట్టుకొని స్పందన కార్యక్రమానికి వచ్చాడు. ఈ సందర్భంగా పురుగుమందు డబ్బా చూపిస్తూ అధికారులు తమ సమస్య పరిష్కరించకపోతే మందు తాగి చనిపోతానని అన్నాడు.అప్పలనర్సయ్యకు నెల్లిమర్ల ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద సర్వే నెంబర్‌ 74/13, 74/17, 74/53లలో సబ్‌ డివిజన్‌ నెంబర్లతో తాత, ముత్తాతల నుంచి సంక్రమించిన 80సెంట్ల భూమి ఉంది. వన్‌బి ఉన్నప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు లేవు. వీటికోసం గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి కలెక్టర్‌ ఆఫీస్‌, రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పాసుపుస్తకం లేక ప్రభుత్వ రాయితీలైన రైతు భరోసా ఇతర పథకాలు అందటం లేదు, ఇదే విషయమై సచివాలయానికి వెళ్లి అడిగితే ఆన్‌లైన్‌లో పేరుంది కానీ, ఎందుకు రాలేదో తమకు తెలియదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ భూమిని కొందరు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఆక్రమించారు. వాళ్ళను అడుగుతుంటే ఇంకెక్కడైనా భూమిస్తామని అంటున్నారు, తన భూమినే తనకు ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించకపోవడంతో దిక్కులేని పరిస్థితిలో కలెక్టరేట్‌కు వచ్చానని, ఆత్మహత్య చేసుకోవడం మినహా వేరే గత్యంతరం లేదని తెలిపాడు. చనిపోయేకైనా ఈ సమస్య పరిష్కారమైతే నా కుటుంబానికైనా మేలు జరుగుతుందని ఆవేదన చెందాడు. భార్య బిడ్డలతో పూరిపాకలో నివసిస్తున్నానని, ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు అతని వద్దగల పురుగుమందు డబ్బాను లాక్కున్నారు. అక్కడికి వచ్చిన జెడ్‌పి చైర్మన్‌ దృష్టికి సమస్యను పోలీసులు తీసుకెళ్లగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో అప్పలనర్సయ్య వెనుతిరిగాడు.

➡️