పిఠాపురానికి నువ్వా..నేనా..!

Jan 17,2024 23:50
సాధారణ ఎన్నికలు

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థుల ఎం పికలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధికార వైసిపి అభ్యర్థి విషయంలో అధిష్టానం స్పష్టత ఇచ్చిం ది. అయితే స్థానిక నాయకత్వం అందుకు ససేమిరా అనడంతో ప్రశ్నార్థకంగా మారింది. ఇక ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచినా..నియోజకవర్గాల కేటాయింపుల్లో నేటికీ ఒక స్పష్టత రావడం లేదు. దీంతో తమ నియోజకవర్గానికి అభ్యర్థి ఎవరనే అయో మయంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎంఎల్‌ఎగా పెండెం దొరబాబు అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నియోజకవర్గాల అభ్యర్థుల చేర్పులు..మార్పులు విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ దొరబాబును కాదని, కాకినాడ పార్లమెంటుకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వంగా గీతను పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఆమె నియామకంపై నియోజకవర్గ వైసిపిలో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. సిట్టింగ్‌ ఎంఎల్‌గా ఉన్న పెండెం దొరబాబు 2004లో బిజెపి తరఫున పోటీ చేసి ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. తదుపరి 2014లో వైసిపి నుంచి పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. అయితే 2019లో వైసిపి నుంచి మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. రెండు దఫాలు నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా ఉన్న ఆయన మూడోసారి పోటీ చేసి విజయం సాధించి హేట్రిక్‌ కొట్టాలని సిద్ధపడుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఆయన ఊహాలకు బ్రేకులు వేసింది. ప్రస్తుతం కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వంగా గీతను పిఠాపురం నియోజకవర్గానికి సమన్వయ కర్తగా నియమించింది. దీంతో ఒక్కసారిగా వైసిపిలో విభేదాలు భగ్గుమన్నాయి. పెండం దొరబాబును అభ్యర్థిగా ప్రకటిం చకపోతే స్థానిక నాయకులు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసిన వంగా గీత ఎంఎల్‌ఎగా ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నిక య్యారు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేకంగా కేడర్న్‌ను ఆమె ఏర్పాటు చేసుకున్నారు. దీంతో నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన వెంటనే ఆమె కేడర్‌ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ పెండెం దొరబాబు, ఎంపీ వంగా గీత మధ్య ఒక్కసారిగా విభేదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో దొరబాబు పార్టీని వీడి, మరోపార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తులో ఉన్నాయి. ఇక్కడ టిడిపి నుంచి ఎస్‌విఎస్‌ఎస్‌.వర్మ, జనసేన పార్టీ నుంచి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాలను ఆశిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 2014లో టిడిపి నుంచి వర్మతోపాటు, కైట్‌ విద్యా సంస్థల అధినేత పోతుల విశ్వం పోటీ పడ్డారు. ఆఖరికి టిడిపి అధిష్టానం విశ్వంకే టిక్కెట్టును కేటాయించింది. దీంతో వర్మ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి సుమారు 50 వేల ఓట్ల ఆధిక్యంతో టిడిపి, వైసిపి అభ్యర్థులను ఓడించారు. వెంటనే ఆయన తిరిగి టిడిపిలో చేరారు. గత ఐదేళ్లుగా అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తున్నారు 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాలని వ్యూహాలను రచించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తు అనివార్యం అయ్యింది. దీంతో ఈ టిక్కెట్టును పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయిస్తారనే ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది. ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌్‌గా ఉన్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ స్థానికేతరుడు కావడంతో టిడిపి అధిష్టానం ఈ టిక్కెట్టును టిడిపికే ఉండేలా చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఇదే నియోజక వర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీకి దిగుతారనే ప్రచారం లేకపోలేదు. అదేజరిగితే టిడిపి అధిష్టానానికి చేసేది ఏమీ ఉండదు. వర్మకు టిక్కెట్టు లభించే అవకాశాలు ఉండవు. దీంతో ఆయ న పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక గతంలో మాదిరిగా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలో నిలుస్తారా? అనే వేచిచూడాల్సిందే.

➡️