పెండింగ్‌ వేతనాలు ఇవ్వకపోతే ముట్టడిస్తాం

క్రోసూరు: క్రోసూరు గ్రామపంచాయతి కార్మికులకు ఎనిమిది నెలల పెండింగ్‌ వేతనాలను వెంటనే ఇవ్వాలని సిఐ టియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు డిమాండ్‌ చేశారు. పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని క్రోసూరు మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి,కార్యాలయ సిబ్బందికి మెమోరాండం ఇచ్చి అందుబాటులో లేని ఎండిఓ కి ఫోన్‌ చేసి సమస్య వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ క్రోసూరు గ్రామపంచాయతిలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు 17 మందికి 8 నెలల జీతాలు ఇవ్వక పోవడం సిగ్గుచేటని విమర్శించారు. దళిత, పేద కుటుంబాలకు చెందిన పారిశుధ్య కార్మికులు ఎనిమిది నెలలు వేతనాలు రాకపోతే ఏ విధంగా కుటుంబాలు గడుస్తాయో ఒక్కసారైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆలోచించారా అని ప్రశ్నించారు. క్రోసూరు గ్రామపంచాయతిలో ఎక్కడ చెత్త ఎక్కడ మురుగు అక్కడే పేరకపోతున్న కనీసం పట్టించు కోకపోవడం దుర్మార్గమని అన్నారు. శుక్రవారం సాయంత్రానికి వేతనాలను ఇవ్వకపోతే శనివారం గ్రామపంచాయతీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు క్రోసూరు నాయకులు ఎం మురళి శ్రీనివాసరావు జొన్నాదుల దుర్గ,యం కొండలు,సువార్త మరియమ్మ మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️