పెండింగ్‌ వేతనాల కోసం ఎస్‌ఎస్‌ఎ సిబ్బంది ధర్నా

Dec 8,2023 23:39
ఎస్‌ఎస్‌ఎ

ప్రజాశక్తి – అమలాపురం
పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలంటూ ఎపి సర్వ శిక్ష అభియాన్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధర్యంలో ఉద్యోగులు ఆవేదన దీక్ష, మానవహారం నిర్వహించారు. ఈ దీక్షను ఉద్దేశించి పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు నూకల బలరాం, కృష్ణవేణి, దుర్గాప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, సమగ్ర శిక్ష ఉద్యోగ నాయకులు శ్రీనుబాబు, వెంకట్‌, నాగన్న, ముత్తాబత్తుల శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. పిఆర్‌సి అమలు చేయకుండా, నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసిన మినిమం ఆఫ్‌ టైం స్కేల్‌పై జిఒలమీద జీవోలు ఇచ్చి అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. సమగ్ర శిక్షలో ఒకే క్యాడర్‌ ఉద్యోగులకు రకరకాల వేతనాలు ఇవ్వడం ఎక్కడా లేదన్నారు. పార్ట్‌ టైం పేరుతో తక్కువ జీతాలు ఇచ్చే విధానాలను మానుకోవాలన్నారు. ఎన్నికలకు ముందు రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలకు రైతు సంఘ నాయకులు అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, యాళ్ల బ్రహ్మానందం మద్దతు తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్‌ నాయకులు వెంకటేశ్వరరావు, గంగాధర్‌, శ్రీనివాస్‌, గౌతమ్‌ ప్రసాద్‌, దుర్గ భవాని ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️