పెట్టుబడి బారెడు..పరిహారం మూరెడు…

Dec 18,2023 23:39
అన్నదాతల కష్టాలకు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

అన్నదాతల కష్టాలకు అంతు లేకుండా పోతుంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు దెబ్బ మీద దెబ్బ తీస్తుంటే మరోవైపు ప్రభుత్వ విధానాలు వలన అన్నదాతలకు నష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఇటీవల వచ్చిన తుపాను వేలాది ఎకరాల్లో పంటలను ముంచెత్తి రైతులకు కన్నీటిని మిగిల్చింది. తేరుకోలేని విధంగా పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో కర్షకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కంటి తుడుపు చర్యలకే పరిమితము అవుతుంది.కాకినాడ జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు వరిని పండించలేకపోయారు. ఎకరా రూ. 35 నుంచి 40 వరకు పెట్టుబడి పెట్టి అనేక కష్టనష్టాలు నడుమ సాగు చేపడితే చివరిలో మిచౌంగ్‌ తుపాను వచ్చి ముంచెత్తింది. 2.04 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిని సాగు చేయగా అన్ని మండలాల్లో దాదాపు 42 వేల ఎకరాల్లో వరి ఇతర పంటలకు భారీ నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే 117 గ్రామాల్లో సుమారు 2,400 ఎకరాల్లో ఉద్యాన, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో జిల్లాలో దెబ్బతిన్న పంట నష్ట అంచనాలను ఈనెల 11 నుంచి 18 వరకూ లెక్కించారు. నష్టం అంచనాల జాబితాను సామాజిక తనిఖీల కోసం 18-22 తేదీల్లో రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులుంటే వాటిని పరిష్కరించిన అనంతరం తుది జాబితాను 26వ తేదీన కలెక్టర్‌ ద్వారా పెట్టుబడి రాయితీకి ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిస్తారు. పంట నష్టం లెక్కింపునకు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో బందాలను వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో ఏర్పాటు చేసి అంచనా వేశామని అధికారులు తెలిపారు. గ్రామ స్థాయి టీమ్‌లో విఆర్‌ఒ, విఎఎ, విహెచ్‌ఎ, ఎఇఒ, ఎంపిఇఒలు, తహశీల్దారు, ఎంఏఓ, డివిజన్‌ స్థాయి బందంలో వ్యవసాయ సహాయ సంచాలకులు, సంబంధిత ఆర్‌డిఒలు ఉన్నారు. పరిహారం అరకొరతుపాను ప్రభావంతో 33 శాతం మించి పంటకు నష్టం జరిగితేనే రైతులకు పరిహారం దక్కుతుందని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దాంతో వేల మంది రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. నిబంధన ప్రకారం ఇచ్చే పరిహారం కూడా అరకొరగానే ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెక్టారు (2.47 ఎకరాలు) వరి, పత్తి పంటలకు రూ.17 వేలు అంటే ఎకరాకు రూ.6883 మాత్రమే ఇస్తుంది. మినుములకు హెక్టారుకి రూ.12,500, పెసలు, పొగకుకి రూ.10 వేలు చొప్పున పరిహారం అందజేస్తోంది. వాస్తవానికి ఎకరాకు రూ.35 వేలు పైనే ఖర్చులు అవుతుండగా దిగుబడులు సక్రమంగా వస్తేనే పెట్టుబడి సొమ్ములు దక్కే అవకాశం ఉంటుంది. తుపాను వల్ల నిండా మునిగిన రైతన్నలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎప్పటి లాగే అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని రైతు సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఎకరాకు కనీసంగానైనా రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని, 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితేనే పరిహారం అనే నిబంధనను కూడా సడలించాలని రైతులు కోరుతున్నారు.

➡️