పెరుగుతున్న నష్టం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: మిచౌంగ్‌ తుపాను వల్ల పంటనష్టం రోజురోజుకూ పెరుగుతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయగా దాదాపు మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారుల ప్రాథమిక అంచనాలను నిర్ధారిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో గురువారం రాత్రివరకు అందిన సమాచారం ప్రకారం 1,02,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 37,500 ఎకరాల్లో మినుము, శనగ తదితర పంటలు, 27 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్టు తెలిసింది. పల్నాడు జిల్లాలో 10 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో మినుము, 40 వేల ఎకరాల్లో మిర్చి, 20 వేల ఎకరాల్లో శనగ, 40 వేల ఎకరాల్లో పత్తి, మరో 10 వేల ఎకరాల్లో ఉద్యానపంటలకు నష్టం జరిగింది. చాలా ప్రాంతాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. బొప్పాయి, డ్రాగన్‌ఫ్రూట్‌, నిమ్మ, జామ, బత్తాయి తదితర పంటలకూ నష్టం జరిగింది. భారీ వర్షాలు, అధిక గాలులకు దెబ్బతిన్న పంటలకు ఏర్పడిన నష్టం ప్రాథమిక అంచనాలను దాటి మరింత పెరుగుతోంది. పలు గ్రామాల్లో ఇప్పటికి పంటలు నీటిలో తేలియాడుతున్నాయి. రైతులే శ్రమించి నీటిని బయటకు పంపి పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రెండ్రోజులుగా రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే ఉండి నీటిని బయటకు పంపి ఉన్న పంటలను నిలదొక్కుకునేలా ప్రయత్నిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి వర్షం తగ్గినా వ్యవసాయశాఖ సిబ్బంది ఇంకా పూర్తిగా రైతులకు సహాయపడటం లేదన్న విమర్శలు వచ్చాయి. వరి కోతలు కోసి వర్షానికి తడిచిన పొలంలోని పనలకు గింజ మొలకెత్తకుండా వుండటానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై చల్లుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ మేరకు రైతులు నీటిని బయటకుపంపి ఉప్పు ద్రావణం చల్లుతున్నారు. పొలాల్లో నీరు బయటకు పోవడానికి వీలు లేని పరిస్థితుల్లో వరి పనలను పనలను గట్ల పైకి తెచ్చి వాటిని విడతీసి ఉప్పు ద్రావణం చల్లి కుప్ప వేస్తున్నారు. వరద నీరు భారీగా రావడంతో కాల్వలు, డ్రెయినులు, దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులపై కొంత కాలంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా కాల్వలు, గట్లు, డ్రెయిన్లు మరింత దెబ్బతిన్నాయి. పొలాల నుండి వర్షపు నీటిని బయటకు పంపేందుకు రైతులు పారలతో గట్లకు గండ్లుపెట్టి సమీపంలోని కాల్వల్లోకి పంపుతున్నారు. వరి పైరు కోతకు సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లో నీరు నిలిచిన పరిస్థితుల్లో పంట మధ్య భాగములో చిన్న చిన్న కాల్వలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నీటిని బయటకు పంపి పంటలను కాపాడుకునేందుకు పొలంలో మడుల నుండి నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. నేలవాలిన వరి దబ్బులను లేపి వాటిని నిలబెట్టి కట్టలు కట్టే ప్రక్రియలో రైతులు తలమునకలై ఉన్నారు. గురువారం పూర్తిగా ఎండ రావడం, ఉష్ణోగ్రత పెరగడం ద్వారా మెరక ప్రాంతం నుండి పల్లపు ప్రాంతానికి నీటిని బయటకు వంపుతున్నారు. ఎండకు మెరక నేలల్లో తేమ పొడిబారి చీమ నెర్రెలు ఏర్పడటంతో నీటి నిల్వలను బయటకుపంపి పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో ఇప్పటికీ నీరునిల్వ ఉంది. మరో రెండురోజులు ఎండకాస్తే నీరు కొంత బయటకుపోయి కొంత ఇంకిపోతుందని అధికారులు చెబుతున్నారు. రంగుమారిన, తడిచిన ధాన్యం విక్రయానికి రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
కొండవీటి వాగుతో వెంటాడుతున్న ముంపు

అమరావతి ప్రాంతంలో పెదమద్దూరు వాగుతో ఈ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. గురువారం తాడికొండ మండలంలో కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ, లాం, కంతేరు, మంగళగిరి మండలం నిడమర్రు, నీరుకొండ తదితర ప్రాంతాల్లో వివిధ రకాల పంటలు నీట మునిగాయి. వరి, పత్తి, మిర్చి, శనగ, మినుము తదితర పంటలకు నష్టం వాటిల్లింది. నాలుగేళ్లుగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం సరిగా నిర్వహించకపోవడం వల్ల ఈ ఏడాది ముంపు సమస్య పునరావృతమైనట్లు రైతులు చెబుతున్నారు.రైతులకు భరోసా దక్కెనా? నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తగిన పరిహారం ఇప్పిస్తామని ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, భరోసా ఇస్తున్నారు. అయితే 35 శాతం దెబ్బతిన్న పంటలనే అంచనా వేస్తామని అధికారులు చెబుతున్నారు. వరి, పత్తి, మిరప, సెనగ, మినుము, పెసర, పొగాకు, జొన్న, మొక్కజొన్న కూరగాయలు, అరటి, మామిడి పంటలకు, మూగ జీవాలకు నష్టంపై అంచనాలు రూపొందించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులుతో కమిటీ ఏర్పాటు చేశారు.
దిగుబడి తగ్గుతుంది
తిప్పిరెడ్డి రంగారెడ్డి, రైతు, తుమ్మలచెరువు, పిడుగురాళ్ల మండలం.
ప్రతి సంవత్సరం మిర్చి సాగు చేస్తున్నాం. ఈ ఏడాది నాలుగెకరాల్లో వేసి తొలుత వర్షాభావం, ఇప్పుడు తుపానుతో అష్టకష్టాలు పడతున్నాం. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టగా పంట చేతికొచ్చే సమయంలో ఇలా తుపాను వల్ల నష్టపోయామన్నారు. వర్షాలకు తడిసి వేరు కుళ్లిపోవడం, తలమాడు తెగులు వంటి సమస్యలు వస్తున్నాయన్నారు. కాయలు రంగు మారుతున్నాయి.
వాగువల్ల నష్టపోయాం
తుమ్మపూడి కోటిరెడ్డి, వంగా పోలరెడ్డి కౌలురైతులు, తాడికొండ.
తాడికొండలో మినుము జొన్న రెండెకరాల సొంత పొలం, మరో రెండెకరాల కౌలుకు తీసుకుని సాగు చేశారు. తుపాను వల్ల నష్టం వాటిల్లింది. కొండవీటి వాగు వల్ల మా పొలాలన్నీ మునిగిపోయాయి. ఆ పంటలు మళ్లీ వేసుకోవాల్సిందే. కొండవీటి వాగుని పటిష్ట పరచాలంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తాడికొండ, కంతేరు మార్గంలో భారీ నష్టం జరిగిందని, 100 ఎకరాలు మినుము, 25 ఎకరాల పత్తి, 25 ఎకరాలు జొన్న పంటలకు నష్టం వాటిల్లింది.పైరంతా నేలవాలిందిటి.అంజిరెడ్డి, బ్రాహ్మణపల్లి, రైతు, పిడుగురాళ్ల మండలం.నాలుగెకరాలు వరి సాగు చేయగా అ పైరంతా నేలవాలింది. పొలంలో నీరింకా తొలగిపోలేదు. నీరుఇలాగే ఉంటే వరి మొలకెత్తి ఎందుకుపనికి రాకుండా పోతుంది. ఎకరాకు సుమారు రూ.60 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను.

➡️