పేద విద్యార్థులకు వరం విద్యా దీవెన : డిఆర్‌ఒ

ప్రజాశక్తి – కడప పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వరం లాంటిదని డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విసి ద్వారా విద్యా దీవెన మూడవ విడత లబ్ధి మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లో జమచేశారు. ఈ కార్యక్రమానికి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూష, బిసి కార్పొరేషన్‌ ఇడి బ్రహ్మయ్య, సోషల్‌ వెల్ఫేర్‌ జేడి సరస్వతి హాజరయ్యారు. ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం జిల్లాకు సంబంధించి అర్హులైన 10 మంది విద్యార్థులకు మూడవ విడతగా మంజూరైన రూ.10379140ల మెగా చెక్కును విద్యార్థులు, వారి తల్లులకు అందజేశారు. ఈ సందర్బంగా గంగాధర్‌ గౌడ్‌ మాట్లాడుతూ జగనన్న విదేశీ విద్యా పథకం ద్వారా పూర్తి స్థాయి ఫీజు రీయింబర్సుమెంటు సదుపాయాన్ని సిఎం అమలు చేశారన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాకు చెందిన విద్యార్థులు వారికి ఇష్టమైన యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ పొంది ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఎపి సిఇఒ సుధాకర్‌రెడ్డి, డిఎస్‌డిఒ జగన్నాథ రెడ్డి, అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.

➡️