పొంచి ఉన్న నీటి ఎద్దడి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈఏడాది జులై నుంచి ఇప్పటి వరకు ఎగువ నుంచి వరద ప్రవాహం రాకపోవడం వల్ల నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. పులిచింతల జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా గురువారం సాయంత్రం 15.31 టిఎంసిల నీటి నిల్వ ఉంది. ఈ ఏడాది గరిష్టంగా 35 టిఎంసీల వద్దనిల్వ ఉండగా డెల్టాలోని పంటలకు దాదాపు 20 టిఎంసిల నీటిని వినియోగించారు. రబీలో డెల్టాలో మొక్కజొన్న, జొన్న సాగుకు నీరు ఇవ్వలేమని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల తుపాను ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో రైతులు ఈ పంటలను సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. పంట చేతికి వచ్చే ముందు ఎదుగుదల కోసం చివరిలో నీటి ఎద్దడి ఏర్పడితే అనివార్యంగా కాల్వలకు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ వచ్చే అవకాశం లేకపోలేదు. జనవరి నెలాఖరుకు సాగర్‌ జలాశయంలో నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేగాక ఉమ్మడి జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మిర్చికి ఇంకా కనీసం రెండు తడులు అవసరం ఉంది. ఇటీవల వచ్చిన తుపాను వల్ల కొంత వరకు నీటి ఎద్దడి తగ్గింది. తుపాను తరువాత మళ్లీ వర్షం లేదు. జనవరి మొదటి వారంలో కనీసం ఒక తడికి నీరు అవసరం అవుతుందని రైతులు చెబుతున్నారు. గత నెల 30న సాగర్‌ డ్యామ్‌పైకి పోలీసులను పంపి సగం వరకు క్రస్ట్‌ గేట్లను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుని భారీ హడావుడి చేసింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో 9 వేల క్యూసెక్కులు మాత్రమే నీటిని తాగునీటి అవసరాల కోసం తీసుకున్నా ఉపయోగం లేకుండాపోయింది. మళ్లీ నీటి అవసరాల కోసం ఇంత వరకు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు విజ్ఞాపన పంపలేదని తెలిసింది. ప్రస్తుతం ఎండ తీవ్రత లేకపోవడం, వాతావరణం చల్లగా ఉండటం, ఇటీవల తుపాను వల్ల కురిసిన వర్షాలతో నీటి ఎద్దడి కొంత మేరకు తగ్గినా జనవరి రెండో వారం కల్లా నీటి సమస్య ఏర్పడవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్‌లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగానీటి నిల్వ గణనీయంగా తగ్గింది. నీటి నిల్వలు గరిష్టంగా 500 అడుగులకు చేరుకునే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం 153 టిఎంసిల నీటి నిల్వ ఉంది. గరిష్ట నీటి నిల్వ 312 టిఎంసీలు కాగా సగానికి తగ్గిపోయింది. ప్రస్తుతం 522 అడుగుల వద్ద నీటి నిల్వ ఉన్నా ఈ నిల్వ క్రమంగా తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో అటు సాగర్‌ ఆయకట్టులో మిర్చికి, డెల్టాలో జొన్న, మొక్కజొన్నకు నీటి ఎద్దడి అనివార్యంగా కన్పిస్తోంది. జనవరి తరువాత ఏప్రిల్‌లోపు రెండు విడతలుగా 10 టిఎంసీలు తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకునేందుకు అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో సాగు చేసిన మిర్చికి, రబీలో సాగు చేసిన ఇతర పంటలకు నీటి సమస్యను ఎలా అధిగమిస్తారో వేచిచూడాల్సిందే.

➡️