పొగాకు వైపు మరల్చిన పరిస్థితులు

ప్రజాశక్తి – చిలకలూరిపేట : మొన్నటి వరకూ తీవ్రమైన సాగునీటి ఎద్దడి… అనంతరం కొద్దిపాటి వర్షాల నేపథ్యంలో పొగాకు బర్లీ సాగుకు వాతావరణం అనువుగా ఉందని రైతులు భావిస్తున్నారు. గతేడాది దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతోపాటు ధరలూ బాగుండడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు ఈ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మిర్చి సాగుతో పోలిస్తే పెట్టుబడులు, పనులు తక్కువ కావడంతో సాగు పెరుగుదలకు మరో కారణంగా కనిపిస్తోంది. ప్రతిఏటా మండలంలో 500-800 ఎకరాల్లో పొగాగు సాగవుతుంది. ఈ ఏడాది ఇప్పటికే 800-1100 ఎకరాల్లో సాగైంది. మొత్తంగా 1500-1800 ఎకరాలకు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది సాగైన పంటకు ప్రస్తుతం క్వింటాళ్‌ రూ.15-17 వేల వరకూ ఉంది. ఎకరాకు 13-15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ధరలు, దిగుబడి ప్రకారం కనీసంగా ఎకరాకు రూ.లక్షన్నర వరకూ ఆదాయం రావొచ్చని రైతులు అంచనాతో సాగు చేపడుతున్నారు.ఎకరా పొగాకు సాగుకు మొక్కల కొనుగోలు రూ.4-7 వేల వరకూ ఉంటుంది. నాటు కూలి రూ.2 వేలు, తొలి దుక్కులు, ఎరువులు రూ.3 వేలు, మధ్యలో కాస్తంత తెగుళ్లు సోకితే ఎరువులు వాడినా చివర్లో కోతకోసి ఎండబెట్టడానికి రూ.5-7 వేల వరకు ఖర్చు ఉంటుంది. మంచుతో పెరిగే ఈ పంట సాగుకు మొత్తంగా ఎకరాలకు రూ.18-25 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. కౌలు రూ.ఆరేడు వేల వరకూ ఉంది. మూడు నాలుగు నెలలోల పంట చేతికొస్తుంది. ఇవన్నీ ఆలోచించి ఎక్కువ మంది రైతులు పొగాకు సాగుకు ఆసక్తిగా ఉన్నారు. మండలంలోని బొప్పూడి, మురికిపూడి, కమ్మవారిపా లెంతోపాటు ఇతర గ్రామాల్లోనూ సాగు చేస్తున్నారు. అయితే పంట చేతికొచ్చే నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళనా రైతుల్లో లేకపోలేదు. మరోవైపు ఐటిసి అనుమతి లేకుండా సాగు చేసిన రైతులు తమ పంటను ఇతర కంపెనీలకు విక్రయించాల్సిన నేపథ్యంలో వారు అప్పుడు ధరలెలా ఇస్తారనే సంశయమూ నెలకొంది.నీటి ఎద్దడి వల్ల ఇదే నయమనిపించిందియోహాను, కౌలురైతు, మురికిపూడి.ప్రతి సంవత్సరం 3-5 ఎకరాల్లో పొగాగు సాగుచేసేవాణ్ణి. గతేడాది బర్లీ పోగాకుకు మంచి ధర వచ్చింది. క్వింటాళ్‌ రూ.18 వేలు పలికింది. ఈ ఏడాది కూడా అంతే ధరలు ఉంటాయని అనుకుంటున్నాం. దీనికితోడు నాటి ఎద్దడి వల్ల పొగాకు సాగే నయమనిపించి 8 ఎకరాల్లో సాగు చేస్తున్నాను.

➡️