పొలికేక

Feb 17,2024 21:16 #పొలికేక

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసన పెల్లుబికింది. ప్రధాని స్థాయిలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీని పక్కనబెట్టి మూడు రైతు వ్యతిరేక నల్లచట్టాలను అమలు చేయడానికి సిద్దపడడం, అమలు కమిటీ వేయడం, రైతు సంఘాల ప్రతినిధులకు, మేధావులకు, వ్యవసాయరంగ నిపుణులకు సంబంధించిన వారెవరికీ స్థానం లేకుండా చేయడంలోని మరమ్మమేటో తెలియడం లేదు. రైతు వ్యతిరేక చట్టాల అమలును నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ధర్నాకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్‌కు వామపక్షాల ఆధ్వర్యంలోని రైతు సంఘాలు, కార్మికులు, వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం కడప, అన్నమయ్య జిల్లాల్లోని 66 మండలాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన గ్రామీణ బంద్‌ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను రైతు సంఘాల నాయకులు తూర్పారపట్టడంలో సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. రైతాంగ నల్లచట్టాల గురించి రైతు సంఘాల నాయకులు, మేధావులు మాట్లాడుతున్నారే తప్పా క్షేత్రస్థాయిలోని అసలైన రైతులకు రైతు వ్యతిరేక చట్టాలు, ఎంఎస్‌పి ధరల అమలు వంటి మాటలు చేరలేదని తెలుస్తోంది. తాజా గ్రామీణ బంద్‌ నేపథ్యంలో ఇటువంటి రైతాంగ నల్ల చట్టాలు, అందులోని నిబంధనలు రైతుల చెవికి సోకినట్లు తెలుస్తోంది. ఫలితంగా రైతుల్లో చైతన్యం వెల్లివిరిసే అవకాశం ఉంది. ఇంతటితో ఆగకుండా మరింత ఉధృతంగా రైతుల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్రంలోని బిజెపి సర్కారు రైతు వ్యతిరేక కార్పొరేట్‌ అనుకూల విధానాలను రైతులు అర్థం చేసుకునే అవకాశం ఉంది. లేనిపక్షంలో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల రైతులకు పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఉత్తరాధి రాష్ట్రాల రైతులకు రైతు వ్యతిరేక చట్టాల దుష్ఫలితాల ప్రభావాల గురించి తెలిస్తే రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు రైతు వ్యతిరేక చట్టాలకు పార్లమెంటులో రహస్యంగా ఓట్ల వేయడం ద్వారా మద్దతు తెలిపి, ప్రస్తుతం జెండాల మాటున దాక్కున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైతులు వీధుల్లోకి వస్తే అధికార, ప్రతిపక్ష పార్టీలు ముసుగు తొలగిపోనుంది. లేనిపక్షంలో కేంద్రంలోని బిజెపి సర్కారుతో రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు అంటకాగుతూ రైతులకు తీరనిద్రోహం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని రైతుల్లో ఏకీభావం కొరవడిన ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు పబ్బం గుడుపుకుంటున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సరే, రైతాంగ నల్ల చట్టాల గురించి పెదవి విప్పకపోగా మద్దతు తెలపడం బరితెగింపును గుర్తుకు తెస్తోంది. దేశంలోని రైతులను కార్పొరేట్లకు బలి పశువుల తరహాలో బలి చేయడానికి వెనుకాడకపోవడం దౌర్భా గ్యమనే చెప్పాలి. ఇటువంటి రాజకీయ పార్టీలకు రైతులు బుద్ధి చెప్పాలి. ఇటువంటి పార్టీలను గుర్తించి వాటికి సహాయ నిరాకరణ చేయాలి. ఎంపీలను నిలదీయాలి, వాటిని రద్దు చేసే వరకు నిలదీతలు కొనసాగాలి. అప్పుడు దేశీయ రైతులు బతుకులు బాగు పడతాయని చెప్పవచ్చు. – ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️