పోక్సో కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎఎస్‌పి రాహుల్‌ మీనా

ప్రజాశక్తి-చింతూరు

ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసి, వారిలో ఒకరిని హత్య చేసిన సంఘటనలో ఇద్దరు ముద్దాయిలకు పోక్సో చట్టం కింద జీవిత ఖైదు, వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు శనివారం చింతూరు పోలీస్‌ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను అడిషనల్‌ ఎస్‌పి రాహుల్‌ మీనా వెల్లడించారు. ఎఎస్‌పి తెలిపిన వివరాలు ప్రకారం… చింతూరు మండలం మామిల్లగూడెం గ్రామానికి చెందిన మిడియం రమేష్‌, ముచ్చుక లక్ష్మణరావు ఇద్దరూ అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలపై 2019 ఆగస్టులో అత్యాచారం చేశారు. అనంతరం ఒక బాలికను హత్య చేసి ఉరివేసుకొని చనిపోయినట్లుగా చిత్రీకరించారు. మరో బాలిక ముద్దాయిల బారి నుండి తప్పించుకొని చనిపోయిన బాలిక తల్లి చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లి చింతూరు పోలీస్‌ స్టేషన్లో 2019 ఆగస్టు 15న ఫిర్యాదు చేశారు. నాటి చింతూరు ఎస్‌ఐ మహా లక్ష్మణుడు ఎఫ్‌ఐఆర్‌ క్రైమ్‌ నెంబర్‌ 66/2019, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్‌పి నయన్‌ హస్మి ఆదేశాల మేరకు చింతూరు ఎఎస్పీ ఖాదర్‌ బాషా దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పితాని శ్రీనివాసరావు వాదించగా, నేరం రుజువైంది. దీంతో స్పెషల్‌ జడ్జి వెంకటేశ్వరరావు ఎ1 మిడియం రమేష్‌, ఎ2 ముద్దాయి ముచ్చిక లక్ష్మణరావులకు ఒక్కొక్కరికి 20 సంవత్సరాల చొప్పున జీవిత ఖైదు, పోక్సో చట్ట ప్రకారం మూడు సంవత్సరాల కఠిన శిక్ష, వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ, అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు జరిగే విధంగా ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు. మరణించిన బాలిక తల్లికి రూ.5 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని రాజమహేంద్రవరం డీఎల్‌ఎస్‌ఎ వారిని కోర్టు ఆదేశించించినట్లు ఎఎస్‌పి తెలిపారు. మహిళలు చిన్నారులపై వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు చేస్తే కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ గజేంద్రకుమార్‌, ఎస్సై డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️