పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి

పోలవరం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంపోలవరం నిర్వాసిత మండలాలను అత్యాచారాలకు గురవుతున్న ప్రాంతాలుగా ప్రభుత్వం గతంలో ప్రకటించినందున ఈ మేరకు ప్రత్యేకాధి కారులు సమగ్ర నివేదికలు రూపొందించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్‌ చేసారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్‌ 5న పోలవరం ప్రాజెక్టు బడ్జెట్‌ విషయమై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తోంనది, ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అత్యాచారాలకు గురవుతున్న ప్రాంతంగా ప్రకటించాలని ఆదివాసీ మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోందన్నాఉ. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సుల మేరకు 2001లో అప్పటి ప్రభుత్వం జిఒ ఎంఎస్‌ నెంబరు 116 జారీ చేసిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఖమ్మం జిల్లాలు అధికంగా అత్యాచారాలకు గురవుతున్న జిల్లాలుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని, ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. ఇక్కడ భూసేకరణాధికారులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, కోర్టులకు తప్పుడు నివేదికలు సమర్పిస్తూ కొత్త భూసేకరణ చట్టాన్ని, పీసా చట్టాన్ని, ఎస్‌సి, ఎస్‌టటి చట్టాన్ని అధికారులే ఉల్లంఘించి నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సేకరించిన భూమికి తగిన నష్టపరిహారం చెల్లించకపోయినా, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ తక్కువ చెల్లించినా, క్రొత్త భూసేకరణ చట్టంలో చెప్పిన విధంగా నిర్వాసితులకు న్యాయం చేయకపోయినా అధికారులు అట్రాసిటీ చట్ట ప్రకారం నేరస్తులవుతారన్నారు. ఈ సమావేశంలో అరగంటి వీరభద్రారెడ్డి, మడకం బంగారుబాబు, యలగడ నాగేశ్వరరావు, మద్దిపాటి సతీష్‌, ఎం.రత్నరాజు, సోనియా, కె.రఘుపతి, ఎం.పోసమ్మ పాల్గొన్నారు.

➡️