పోలింగ్‌ కేంద్రాల్లో బిఎల్‌ఒల ఫోన్‌ నంబర్లు

Dec 20,2023 20:25

 ప్రజాశక్తి-విజయనగరం :  ప్రతీ పోలింగ్‌ స్టేషన్లో బిఎల్‌ఒ పేరు, ఫోన్‌ నంబర్లు డిస్‌ప్లే చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు ఈ నంబర్లు ఉపయోగపడతాయని అన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమీక్షించారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన వివిధ దరఖాస్తుల పరిశీలన ఈనెల 26తో పూర్తి అవుతుందని చెప్పారు. అనంతరం ఓటర్ల జాబితాలను తయారు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు కూడా ఓటు నమోదు చేసేందుకు దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని జనవరి 5న ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత పరిశీలిస్తామని చెప్పారు. సమావేశంలో డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఇఆర్‌ఒలు వెంకటేశ్వర్రావు, సుదర్శన దొర, నూకరాజు, సుధారాణి, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్‌ శ్రీకాంత్‌, సిబ్బందితోపాటు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️