పోలీస్‌ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్‌పి

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: పోలీస్‌ కుటుంబాలకు అండగా వుంటూ వారి సమస్యల పరిష్కరానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఇటీవల మతి చెందిన ఎఎస్‌ఐ డి.మరియదాస్‌ సతీమణి ఎస్తేర్‌ రాణికి ఫ్లాగ్‌ ఫండ్‌ మరియు విడో ఫండ్‌ చెక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బాధిత పోలీస్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలను గురించి, వారి పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు, పోలీసు శాఖలో అంకిత భావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది మరణించడం బాధాకరమన్నారు. అటువంటి వారి కుటుంబాలకు పోలీస్‌ శాఖ అండగా ఉంటుందన్నారు. మనందరం ఒక పోలీసు కుటుంబమని, ఏదైనా సమస్య వచ్చిన, ఏ సహాయం కావాలన్నా తక్షణం స్పందించి సహాయం అందించడానికి ఎల్లవేళలా పోలీస్‌ శాఖ సంసిద్ధంగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్‌ త్వరితగతిన అందేలా చూస్తామన్నారు. సిబ్బంది నిర్వహించిన విధులు, తీసుకొన్న చొరవ వెలకట్టలేనిదని తెలియజేశారు. కార్యక్రమంలో డీపీఓ బి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ కె.రాధిక, ఇతర డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

➡️