పౌష్టికాహారంతోసంపూర్ణ ఆరోగ్యం

Jan 27,2024 21:33

ప్రజాశక్తి-మక్కువ : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని సక్రమంగా వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. ఫ్రీజం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యేకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామంలో కలెక్టర్‌ శనివారం పర్యటించారు. పదేళ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటు నివారణ కార్యక్రమాన్ని పరిశీలించారు. బాగుజోల గ్రామంలో ఇంటింటిని సందర్శించి గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి మాతా, శిశు మరణాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించాలని గిరిజనులకు సూచించారు.చిన్నారులు, గర్భిణులు, బాలింతలను పరిశీలించారు. వారిలో వచ్చిన మార్పును గమనించారు. గర్భం దాల్చిన వెంటనే పేర్లను ఆసుపత్రిలో నమోదు చేయాలని ఆయన సూచించారు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేసుకోవాలని, వైద్యుల సూచనల మేరకు మందులు, పౌష్టికాహారం తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ పోషణ కింద పౌష్టికాహార కిట్లు అందిస్తుందని, వాటిని గర్భిణులు మాత్రమే తీసుకోవాలని సూచించారు. గర్భిణుల్లో రక్తహీనత సమస్య నివారించుటకు సచివాలయ స్థాయిలో అంగన్వాడీ, ఎఎన్‌ఎం, మహిళా పోలీస్‌ను బృందంగా నియమించామని, వీటిని ఎంపిడిఒ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ బందం రక్తహీనత ఉన్న వారిని గుర్తించి క్రమం తప్పకుండా ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు పంపిణీ చేయడం, పౌష్టికాహారం తీసుకునే విధంగా చర్యలు చేపట్టడం చేస్తుందన్నారు. ఈ చర్యలు వలన మాత, శిశు మరణాలు గణనీయంగా తగ్గించగలిగామని, ప్రజలు మరింత సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి ఎం.వినోద్‌, వైద్యాధికారి రఘుకుమార్‌, కిరణ్‌ కుమార్‌, తహశీల్దార్‌ సూర్యనారాయణ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️