ప్రజాప్రతినిధులకు అంగన్‌వేడి

నరసరావుపేటలో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లకుండా అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవటంతో సమ్మెను ఉధృతం చేశారు. 16వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాలోని ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల వద్ద అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతులు అందచేశారు. ఈ కార్యక్రమాల్లో అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు బ్రాడీపేటలో మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఇంటికి అంగన్‌వాడీలు ర్యాలీగా వెళ్లారు. అయితే ఇంటికి కొద్ది దూరంలోనే బారీకేడ్లు అడ్డంపెట్టి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్‌వాడీలు అక్కడే బరోడ్డుపై బైటాయించి నిరసనకు దిగారు. పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న సుచరిత వెంటనే అంగన్‌వాడీల వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చీఫ్‌ సెక్రెటరీని కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళతానని, సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో వెళ్లగా, ఆయన అక్కడ లేకపోవటంతో బృందాన్‌ గార్డెన్స్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం దాదాపు 12 గంటల సమయంలో ఎమ్మెల్యే ఆఫీసుకు రావటంతో వినతిపత్రం అందజేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు గుంటూరులోని ఆయన నివాసంలో పొన్నూరు, చేబ్రోలు మండలాకు చెందిన అంగన్‌వాడీలు కలిసి వినతిపత్రం అందచేశారు. కార్యక్రమాలలో అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, నాయకులు బి.లక్ష్మణరావు, భాగ్యరాజు, రమేష్‌, నగర కార్యదర్శి కె.శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ఎదుట కొనసాగుతున్న సమ్మె శిబిరంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు చాంద్‌బాషా, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్‌, సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎస్‌.కె.ఖాసింషహీద్‌, సిఐటియు నాయకులు ఖాశింవలి, ఎం.రమేష్‌బాబు సంఘీభావం తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని సమ్మె శిబిరం నుండి అంగన్వాడీలు ర్యాలీగా ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరారు. శివుని బొమ్మ సెంటర్లో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. యూనియన్‌ నాయకులు జోక్యం చేసుకొని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి తీరుతామని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి ముందుకు సాగారు. మల్లమ్మ సెంటర్‌ నుండి గుంటూరు రోడ్డు వైపు ఎమ్మెల్యే ఇంటికి వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. రెండు వైపులా ఉన్న మార్గాలలో బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో పాటు తాళ్లు పెట్టి అంగన్వాడీలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో తీవ్రవాదం వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు ఒక అడుగు వెనక్కి తగ్గిన పోలీసులు యూనియన్‌ నాయకులు కొంతమందిని ఎమ్మెల్యేను కలిసేందుకు అనుమతిచ్చారు. అయితే నివాసంలో ఎమ్మెల్యే లేకపోవడంతో గుమ్మానికి వినతి పత్రం కట్టి వచ్చారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, ఎఐటియుసి రాష్ట్ర సహాయ కార్యదర్శి హెల్డా ఫ్లారిన్స్‌ మాట్లాడారు. సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, నరసరావుపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు న్యాయవాదులతో కలిసి సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు. సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌, ఎఐటియుసి నాయకులు కె.రాంబాబు, వి.వెంకట్‌, సిఐటియు మండల కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌, నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరాజు, నిర్మల, కవిత, విజయలక్ష్మి, ఎఐటియుసి నాయకులు శోభారాణి, యు.రంగయ్య, న్యాయవాదులు చండ్ర రాజేశ్వరరావు, ఎం.చంద్రశేఖర్‌, కెఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఏడుకొండలు, కె.ఆనంద్‌ కుమార్‌, హనుమంతరావు, కె.విజరు కుమార్‌ పాల్గొన్నారు. ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రామకృష్ణ బృందం గేయాలు ఆలపించారు.

➡️