ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుంది : జెసి

వరి పంటను పరిశీలిస్తున్న జేసీ రాజకుమారి, ఇతర అధికారులు
ప్రజాశక్తి-గుంటూరు : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని, జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి అన్నారు. పంట నష్టం అచనాలను ప్రభుత్వాధికారులు చేపట్టిన నేపథ్యంలో వట్టిచెరుకూరు మండలంలో జెసి రాజకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ డిప్యూటీ డైరక్టర్‌ రవీందర్‌, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ జి.లక్ష్మీ, ఆర్డీవో శ్రీకర్‌ మంగళవారం పరిశీలించారు. అనంతవరప్పాడు, లేమల్లేపాడు, కాట్రపాడులో మిర్చిపోలాలను, వట్టిచెరుకూరులో వరి, కారంపూడిపాడులో తడిచిన ధాన్యాన్ని జేసీ పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జెసితో రైతులు మాట్లాడుతూ 20 రోజుల్లో మొదటి కోతకు సిద్ధమయ్యే మిర్చి పొలాలు తుపాను కారణంగా వర్షం నీటిలో నాని వేరు పూర్తిగా చనిపోయి పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో నీరు నిలవటంతో పంటవాలిపోయి నీటిలో పూర్తిగా నాని పోయిందని, వరి కంకులు మొలకలెత్తిందని వాపోయారు. కౌలు ఎకరానికి రూ.50 వేలు చెల్లించామని, పంట పెట్టుబడికి రూ.లక్షకు పైగా ఖర్చయిందని వివరించారు. కారంపూడిపాడులోని రైతులు మాట్లాడుతూ కోసిన వరిని కళ్లాల్లో ఎండబెట్టగా తుపాను కారణంగా వర్షం వల్ల పక్కన ఉన్న డ్రెయిన్‌ పొంగి ధాన్యం మొత్తం నానిపోయి మొలకలెత్తిందన్నారు. పూర్తిగా నష్టపోయామని, తడిచిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు పొలాల్లో నీరు వేగవంతంగా వెలుపలికి వెళ్లేలా వ్యవసాయ డ్రెయియిన్లు పూర్తి స్తాయిలో పూడికతీత, అడ్డంకులు తొలగించాలన్నారు. జెసి మాట్లాడుతూ 18వ తేదీ వరకు పంట నష్టం అంచనాలు వేస్తారని, 18 నుండి 22 వరకు సోషల్‌ ఆడిట్‌ కోసం సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, వీటిపై అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే మరోసారి పరిశీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు. తుది జాబితా 26న ప్రభుత్వానికి ఇస్తామన్నారు. అధికారులు పొలాల వద్దకు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండి వివరాలు చెప్పి సహకరించాలన్నారు. ఆలస్యంగా పొలాలు సాగు చేసిన వివరాలను ఈ-క్రాప్‌ బుకింగ్‌లో నమోదు చేయటానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని, నమోదు చేయించుకోని వారు వెంటనే వ్యవసాయ సహయకుల ద్వారా నమోదు చేయించుకోవాలని సూచించారు. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలుకు నిబంధనలు సడలించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు అందించామని, అనుమతులు రాగానే కొనుగోలును ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, హార్టి కల్చర్‌ సైంటిస్టు డాక్టర్‌ గిరిధరరావు, డీసీఎంఎస్‌ మేనేజర్‌ హరిగోపాల్‌, తహశీల్దారు నాసరయ్య, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

➡️