ప్రత్యేక కేటగిరీ ఓటర్లకు సదుపాయాలు

ప్రజాశక్తి-కడప సాధారణ ఎన్నికల ఓటింగ్‌ సమయంలో ప్రత్యేక కేటగిరీకి చెందిన విభిన్నప్రతిభావంతులు, సీనియర్‌ సిటీజన్లు, ట్రాన్స్‌జండర్‌ ఓటర్లకు అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజరు రామరాజు రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జెసి గణేష్‌ కుమార్‌, కడప నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో సాధారణ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, ఎక్కడా ఎంసిసి ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2035 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సమయంలో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏప్రిల్‌ 5వ తేదీ లోపు అన్నిరకాల ఏర్పాట్లను సంబంధిత ఎఆర్‌ఒల ద్వారా సిద్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద టాయిలెట్లు, తాగునీరు, ట్రాన్స్పోర్టషన్‌, షామియానాలు, పార్కింగ్‌ ప్లేస్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు, సూచిక బోర్డులను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకించి దివ్యాంగులు, సీనియర్‌ సిటీజన్లు, ట్రాన్స్‌ జెండర్‌ ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రౌండ్‌ ఫ్లోర్‌ ప్రధాన్యతతో పోలింగ్‌ బూత్‌ లను ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద.. కొన్ని కుర్చీలు, వీల్‌ చైర్లు, హాండ్‌ హౌల్డ్‌ వాకింగ్‌ ర్యాంపుల సదుపాయాల కల్పన తోపాటు ఎన్జీవో సంఘాల నుండి స్వచ్చంధ సేవా కార్యకర్తలు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌., స్కౌట్‌ గైడ్‌ల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. హోమ్‌ ఓటింగ్‌కు సంబంధించి మంచానికి పరిమితమైన, 85 ఏళ్లు దాటిన వారి డేటాను, పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని విభిన్న ప్రతిభావంతులైన ఓటర్ల డేటా సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఓటింగ్‌ శాతం పెంచడంపై ఆర్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

➡️