ప్రత్యేక శిబిరాలకు మిశ్రమ స్పందన

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఓటర్ల జాబితాల్లో చేర్పులు, మార్పులు, తొలగింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ శని,ఆదివారాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రత్యేక శిబిరాలకు కొన్ని చోట్ల పదులసంఖ్యలో అర్జీలు రాగా కొన్ని గ్రామాల్లో కేవలం 10 లోపు మాత్రమే వచ్చాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలపై టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు దృష్టి సారించాయి. రానున్న ఎన్నికల్లో గెలుపునకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలపై నిశిత పరిశీలనకు హడావుడి చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు తమ ప్రజా ప్రతినిధుల ద్వారా అధికారులపై వత్తిడి తెచ్చి మార్పులు, చేర్పులు, తొలగింపుల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. టిడిపి నాయకులు మాత్రం పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి జాబితాలను పరిశీలించారు. గత నెల 4,5 తేదీల్లో ఇదే రీతిలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించారు. మరోసారి అవకాశం ఇచ్చేందుకు ఈనెల 2,3 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. జాబితాలపై అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 9వ తేదీ చివరితేదిగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాపై స్పెషల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా శని వారం అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులపై వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా బిఎల్‌ఓలు హాజరయ్యారు. పలు పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న స్పెషల్‌ క్యాంపెయిన్‌ను ఏఈఆర్‌ఒలు, సూపర్‌వైజరీ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా పలు కేంద్రాలను పరిశీలించారు. స్పెషల్‌ క్యాంపుల్లో ప్రజల నుండి నూతన ఓటుకై దరఖాస్తులు, ఓటర్‌ కార్డులో చిరునా మా, పేరు, పుట్టిన తేది తదితర మార్పులకు దరఖాస్తులు అందాయి. వీటితో పాటు వేర్వేరు కారణాలతో తొలగింపునకు ఫారం-7 కూడాపెద్ద సంఖ్యలో దాఖలు చేశారు. వీరిలో స్థానికంగా ఉండటం లేదని, పలువురు మృతి చెందారని, బోగస్‌ ఓటర్ల పేరుతో వైసిపి నాయకులు భారీగా దరఖాస్తులు అందిస్తు న్నారని, తమ పార్టీ ఓట్లు తొలగిస్తు న్నారని టిడిపి నాయకులు ఆరోపించారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాలకు టిడిపినాయకులు తప్ప ఓటర్లు చాలా తక్కువ మంది రావడం కన్పించింది. గుంటూరు జిల్లాలో మృతి చెందిన ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారని, వీరిని తొలగిం చాలని టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. 7 నియోజకవర్గాల పరిధిలో 10,513 మంది మృతి చెందినవారి పేర్లు జాబితాల్లో కొనసాగు తున్నాయి. తెనాలిలో అత్యధికంగా 2,899 పేర్లున్నాయి. డబల్‌ ఎంట్రీలు 10,727 పేర్లు ఉన్నాయి. గుంటూరు తూర్పులో అత్యధికంగా 4,458 మంది, పొన్నూరులో అత్యల్పంగా 108 పేర్లున్నాయి. ఓటర్ల జాబితాలో ఉండి అందు బాటులో లేని వారు 5295 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలో నకిలీ ఓట్లు 18 వేల వరకు ఉన్నాయి. చనిపోయిన ఓటర్లను ఇంకా తొలగించలేదు. జిల్లా వ్యాప్తంగా 23 వేల మంది మృతి చెందిన వారిపేర్లు జాబితాల్లో కొనసాగుతున్నాయి. జీరో డోర్‌నెంబరుతో 5019 వరకు ఉన్నాయి. ఓటర్ల తుది జాబితాలను వచ్చేనెల 5న కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించనుంది.

➡️